హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ, ఈ కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. మొత్తం నిందితులు 220మంది కాగా, వైసీపీవారు 65మంది, టీడీపీకి చెందినవారు 20 మంది, కాంగ్రెస్ వారు 12మంది, సీపీఐవారు ఆరుగురు, సీపీఎమ్ వారు ఒక్కరు, బీజేపీవారు నలుగురు, లోక్‌సత్తాకు చెందిన ఇద్దరు ఉన్నారని ప్రకటించారు. ఏ పార్టీకి చెందనివారు 78మంది ఉన్నారని వెల్లడించారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాల్‌మనీ వ్యాపారం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ఎవరిపైన అయినా చండశాసనుడిగా ఉంటానని చెప్పారు.
కాల్‌మనీ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి కాల్‌మనీపై స్టేట్మెంట్ ఇవ్వటం ఎలా సాధ్యమని అన్నారు. కేసులో నిందితులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారని, వారిని అరెస్ట్ చేయలేదని, మరి బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన పాటికి తాను ప్రకటనను చదువుకుంటూ వెళ్ళారని అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించి సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.