వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ప్రధానంగా ఓ ఆరోపణ చేస్తున్నారు. దొంగ ఓట్లు ఉన్నాయని.. ఓట్లను తొలగిస్తున్నారని.. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. సమర శంఖారావం సభలోనూ అదే చెబుతున్నారు. సర్వేలు చేసి మరీ ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఓట్ల జాబితా విషయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోందన్న విషయం దీనితో స్పష్టమైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనను.. ఎన్నికల సంఘం.. సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు ప్రకటించలేదు.
తెలంగాణ అనుభవంతో భయమా..?
తెలంగాణలో దాదాపుగా ఇరవై లక్షలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి. దీనికి ఎన్నికల అధికారి క్షమాపణ కూడా చెప్పారు. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ వేనా.. కాదా అన్న విషయం పక్కన పెడితే.. చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటముల్ని ఇవి ప్రభావితం చేశాయని… కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి.. ఏపీలో ఉండకూడదని… వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. తెలంగాణలో అప్పటి పరిస్థితులు వేరు. ముందస్తు ఎన్నికల కారణంగా… ఓటర్ల జాబితాను సవరించకుండా.. ఉన్న జాబితాతోనే ఎన్నికలకు వెళ్లారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. కొన్నాళ్ల కిందట.. ఓటర్ జాబితాకు.. ఆధార్ అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించింది. చాలా ఉద్ధృతంగా.. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. చివరికి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు కావడంతో.. తప్పని సరి కాదని.. ప్రకటించింది. ఈ క్రమంలో. ఆధార్ తో అనుసంధానం కాని.. లక్షల ఓట్లు దేశవ్యాప్తంగా గల్లంతయ్యాయి.
20 లక్షల డబుల్ ఓట్లన్నీ టీడీపీవేనా..?
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే… ఓట్ల జాబితా సవరణ జరిగింది. ఓట్లు గల్లంతయిన వారి… నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త జాబితా కూడా ప్రకటించారు. అయినా వైసీపీ మాత్రం గల్లంతు ఆరోపణలు చేస్తూనే ఉంది.. కొత్తగా.. హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఇరవై లక్షల మందికి.. ఏపీలో కూడా ఓటు హక్కు ఉందని.. వారెవరికీ ఏపీలో ఓటు హక్కు లేకుండా చేయాలని కూడా ఫిర్యాదు చేశారు. ఇలా రెండు చోట్ల ఈ ఇరవై లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోకూడదంటే .. రెండు చోట్ల ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంటే… తెలంగాణలో ఉన్నట్లు చెబుతున్న 20 లక్షల ఓట్లు టీడీపీ సానుభూతి పరులవే అయినట్లుగా.. ఈ వాదన ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి అన్ని ఓట్లు రాలేదు.
ఓట్ల తొలగించిన వారి జాబితాతో కోర్టుకెళ్లవచ్చు కదా..?
ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం చేసే సర్వేలతో పాటు.. ప్రైవేటు సంస్థలు కూడా సర్వేలు చేస్తూ.. వైసీపీ సానుభూతి పరులయితే.. తొలగించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని సర్వే బృందాలను పట్టుకుని… వారి దగ్గర ఉన్నట్యాబ్ లను లాక్కున్న వైసీపీ నేతలు… ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఓట్ల తొలగింపు .. ఎవరి చేతుల్లో పడితే.. వారి చేతుల్లో ఉండదని.. ఎన్నికల అధికారి అప్పట్లో వైసీపీ నేతలకు చెప్పారు. సర్వే ట్యాబుల్లో… ఓట్ల తొలగింపు సాఫ్ట్ వేర్లు లాంటివేమీ లేవని గుర్తించారు. అయినా వైసీపీ అధినేత మాత్రం.. అదే ఆరోపణ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితాపై పోరాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయపోరాటం చేశారు. నేరుగా తమ వద్ద ఉన్న ఆధారాలతో హైకోర్టుకు వెళ్లారు. కానీ.. వైసీపీ నేతలు.. మాత్రం.. ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ.. న్యాయపోరాటం చేసే ప్రయత్నం చేయడం లేదు. ఓట్ల తొలగింపునకు గురైన ఓ పది మందిని వెంట బెట్టుకుని.. న్యాయపోరాటం చేస్తే.. జనం నమ్ముతారు. లేదంటే.. ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది.