అవసరం అయితే.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను ఖతం చేస్తామని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్… రూ. వెయ్యి కోట్లు కేటాయించి.. కరోనాపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఏపీలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కరోనా నివారణకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేసులు భారీగా పెరుగుతున్నందున వైద్య చికిత్స కోసం.. అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. ప్రస్తుతం 138 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు ఉన్నాయని.. అదనంగా 2380 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి జగన్ ప్రకటించారు.
కొత్తగా కేటాయించిన రూ. వెయ్యి కోట్లను ఆరు నెలల్లో.. .మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని జగన్ ప్రకటించారు. అంటే నెలకు దాదాపుగా రెండు వందల కోట్లు కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నమాట. దీనికి అదనంగా మరో వెయ్యి కోట్లను కేటాయిస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది.రోజుకు ఎడెనిమిది వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. చికిత్స అందడం లేదంటూ.. రోజూ పదుల సంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా… ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు రావడం లేదు. క్వారంటైన్ సెంటర్లలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను మెరుగుపర్చడానికి సీఎం జగన్.. వెయ్యి కోట్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది.