హోంమంత్రి పని తీరు, కొన్ని కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయకుండా కులం కారణంగా ఆగుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సాటి మంత్రి పనితీరుపై ఇలా వ్యాఖ్యలు చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పవన్ ఇంకా ఎన్నికల ప్రచారం అనుకుంటున్నారా అన్న విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అది .. వైసీపీని సైడ్ చేసే ప్లాన్ అని అంటున్నారు.
విపక్షం కూడా కూటమి నుంచే !
జగన్ రెడ్డి రాజకీయంగా ఇనాక్టివ్ అయ్యారు. శవం కనిపిస్తే ఓ సారి వస్తారు లేకపోతే బెంగళూరులో ఉంటారో తాడేపల్లిలో ఉంటారో ఎవరికీ తెలియదు. పార్టీ పరమైన కార్యక్రమాలు ఉండవు. ఆయన ఆస్తుల పంచాయతీల్లో ఆయన ఉంటారు. మరి ప్రజుల గురించి పట్టించుకునేవారు ఎవరు.? అధికార పార్టీని నిలదీసేది ఎవరు?. ఇలాంటి ఆలోచన ప్రజల్లోకి రాకుండా… అలా నిలదీసేందుకు కూడా కూటమిలో ఉన్నారని నిరూపించేందుకు.. ప్రజల కోసం రెండు పాత్రలు పోషిస్తామని పవన్ కల్యాణ్ ఓ సందేశాన్ని తన వ్యాఖ్యల ద్వారా పంపారని అనుకోవచ్చు.
శాంతిభద్రతలపై ప్రజల్లో చర్చ
కారణాలు ఏమైనా కానీ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు ఎక్కువ ప్రచారం లభిస్తోంది. పదేళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన గంజాయి వ్యాపారం, చీప్ లిక్కర్, నాటు సారా, నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేని స్వేచ్చా కారణంగా సమాజంలో నేరగాళ్లకు భయం అనేది తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ భయాన్ని కల్పించకపోతే ఆ నేరాలు తగ్గుముఖం పట్టవు.కానీ ఇప్పటి వరకూ అలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల్లోనూ ఆ అసంతృప్తి కనిపిస్తోంది. కానీ దీన్ని గుర్తించి వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విపక్షం లేదు. అందుకే పవన్ రంగంలోకి దిగారు.
పవన్ ప్లాన్ గుర్తించి అప్రమత్తమైన వైసీపీ
తమ రోల్ కూడా పవన్ కల్యాణ్ పోషించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించడానికి వైసీపీకి ఎంతో సమయం పట్టలేదు. అందుకే హైదరాబాద్ లో మాజీ మంత్రి బుగ్గనతో ప్రెస్ మీట్ పెట్టించి… ప్రభుత్వంలో ఉన్న వారే తోటి మంత్రి పనితీరుపై ఎలా మాట్లాడతారని .. ఆయనకు పొలిటికల్ ఓరియంటేషన్ క్లాసులు అవసరమని చెప్పుకొచ్చారు. కానీ జరిగిపోయింది ఏమిటో బుగ్గలకు బాగా తెలుసు. అందుకే ఆయన హైదరాబాద్ లో టైంపాస్ చేస్తున్నారు.