హైదరాబాద్: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక కార్యక్రమంలో ఎదురుపడ్డారు. వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి కుమారుడి వివాహం నిన్న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోనే బాలయ్య, జగన్ ఎదురుపడి నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ కార్యక్రమానికి రామోజీరావు, దాసరి నారాయణరావు, చిరంజీవి, రాఘవేంద్రరావు, నిమ్మగడ్డ ప్రసాద్, మోహన్ బాబు, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఎన్.వి.రమణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, రఘువీరారెడ్డి, దేవినేని నెహ్రూ, సీఎం రమేష్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
ఈ శుభకార్యానికి పిలిచేందుకు జగన్ భూమనతో కలిసి సెప్టెంబర్ నెలలో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావును కలవటం, అది పెద్ద సంచలనం సృష్టించటం తెలిసిందే. పార్టీలకతీతంగా టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు అగ్ర నాయకులు ఈ ఫంక్షన్‌కు హాజరవటం చర్చనీయాంశమయింది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం తరపున, భూమన కరుణాకరరెడ్డి కాంగ్రెస్ తరపున తిరుపతి నియోజకవర్గానికి పోటీ చేయగా చిరంజీవి స్వల్ప మెజారిటీతో గెలిచారు.