ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఓ సమావేశంలో ఉండటం సాధ్యమేనా..? అసెంబ్లీ సమావేశాలు కాకుండా.. . నేరుగా ఎదురెదురుగా కూర్చునే మీటింగ్ వారి మధ్య ఊహించగలమా..? మొదటి సారి అలాంటి సమావేశం పదిహేడో తేదీన జరగబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం అత్యున్నత కమిటీ సమావేశం కాబోతోంది. నిబంధనల ప్రకారం.. ఈ కమిటికీ ముఖ్యమంత్రి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ, శాసన మండలిల్లో ప్రతిపక్ష నేతలతో పాటు హోంమంత్రి సభ్యులుగా ఉంటారు.
అంటే సీఎం జగన్తో పాటు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, హోంమంత్రిగా సుచరిత , అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని, మండలి చైర్మన్గా షరీఫ్, మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల కూడా సభ్యులుగా ఉంటారు. అంటే మొత్తం ఆరుగురితో ఉన్న అత్యున్నత కమిటీలో ముగ్గురు వైసీపీకి చెందిన వారు.. ముగ్గురు టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే ఈ కమిటీ సమావేశం ఆసక్తికరంగా మారింది. మానవహక్కుల కమిటీని ఏర్పాటు చేయకపోతే.. న్యాయస్థానాల నుంచి చీవాట్లు ఎదురవుతాయి. ఒక వేళ ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా కమిటీ సమావేశం నిర్వహించి… కమిటీని ఎంపిక చేయాల్సి ఉంది. అందుకే సీఎం జగన్ చంద్రబాబుతో పాటు షరీఫ్, యనుమలతో సమావేశానికి అంగీకిరంచినట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఇప్పటికైతే అధికారికంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజుకు జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా… ఒక వేళ జరిగితే.. ప్రతిపక్ష నేతలు హాజరవుతారా.. అన్నది సస్పెన్సే. హాజరయితే మాత్రం… మానవహక్కుల కమిటీ విషయంలో.., ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రాబబుల్స్ విషయంలో విపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో కమిటీ నియామకం పెండింగ్లో పడే అవకాశం ఉంది. అందుకే.. ఈ మీటింగ్ కాస్త ఆసక్తి రేపుతోంది.