విజయవాడ పర్యటనకు వచ్చిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. తిరుపతి పర్యటన నుంచి విజయవాడ వచ్చి ఓ హోటల్ లో బస చేసిన సీజేఐని ముందుగా సీఎం జగన్ కలశారు. సతీమణితో కలిసి హోటల్‌కు వెళ్లిన ఆయన ఇరవై నిమిషాల సేపు భేటీ అయ్యారు. జగన్ వెళ్లిన వెంటనే చంద్రబాబు వచ్చారు. వారి మధ్య కూడా ఇరవై నిమిషాల సేపు భేటీ జరిగింది. ఇద్దరి భేటీలు మర్యాదపూర్వకమేనని తెలుస్తోంది.
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకి పలుమార్లు వచ్చారు. మొదట వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం .. సీఎం జగన్ పట్టించుకోలేదు. కానీ రెండో సారి వచ్చినప్పుడు మాత్రం భారీగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఆ సమయంలో చాలా మంది సీజేఐని కలిశారు. కానీ చంద్రబాబు మాత్రం కలవలేదు. అయితే ఇప్పుడు మాత్రం కలిశారు. విజయవాడలో కోర్టు భవనాల ప్రారంభోత్సవంతో పాటు ఏఎన్‌యూలో డాక్టరేట్ అందుకునే కార్యక్రమాల్లో సీజేఐ రమణ పాల్గొంటారు.
సీజేఐగా ఎన్వీ రమణ నెలాఖలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా యు యు లలిత్‌ను ఖరారు చేశారు. ఆయనకే సీజేఐ రమణ బాధ్యతలివ్వనున్నారు. అంటే సీజేఐ హోదాలో ఏపీలో పర్యటించడం ఇదే చివరి సారి.