అంతిమ ఫలితం తేలేవరకు ఎన్ని సవాళ్లయినా విసరవచ్చు… కానీ.. యుద్ధం ముగిసిన తర్వాత, పరాజయం, పరాభవం తేలిపోయిన తర్వాత కూడా సవాళ్లు విసిరితే అది కామెడీగా ఉంటుంది తప్ప… మరో లాభం లేదు. ఓడిపోయిన తర్వాత కూడా తాము సవాళ్లు విసురుతూ.. రభస చేస్తూ ఉంటే.. న్యాయం తమవైపున ఉన్నదని ప్రజల్ని మభ్యపెట్టవచ్చుననే భావన కొందరికి ఉండవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి అండ్ కో ఆలోచన సరళి, వారి పార్టీ వ్యవహరిస్తున్న తీరు అందుకు నిదర్శనంగానే కనిపిస్తోంది. వారు అచ్చం అలాగే మాట్లాడుతున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా… పైచేయి తమదే అనే భ్రమను ప్రజల్లో నాటడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహనరెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టించారు. దాని మీద సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. అనివార్యంగా అభ్యంతరకరమైన అంశాల ప్రస్తావనతో సహా… చాలా పెద్ద చర్చే నడిచింది. మొత్తానికి చివరగా.. స్పీకరు మూజువాణీ ఓటు ద్వారా అవిశ్వాస తీర్మానం మీద ఓటింగు నిర్వహించారు. అవిశ్వాసం వీగిపోయినట్లుగా ప్రకటించారు. అంత వరకు అంతా బాగానే ఉంది. ఇంతకంటె భిన్నంగా జరుగుతుందని ఎవ్వరూ ఊహించింది కూడా లేదు. అయితే ఆ తర్వాతే అసలు డ్రామా మొదలైంది.
అవిశ్వాసం వీగిందని తేల్చేశాక, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డివిజన్ కావాలని కోరారు. అంటే మూజువాణీ అంటే.. తీర్మానానికి ఎస్ ఆర్ నో అరిచి చెప్పాలని కోరడం… అందులో ఎక్కువమంది చెప్పినట్లుగా స్పీకరు తన విచక్షణకు భావించిన దానిని ప్రకటించడం జరుగుతుంది. డివిజన్ అంటే.. ఆ స్పీకరు భావనపై నమ్మకం లేకుండా.. ఎస్ ఆర్ నో చెప్పే వారిని లేచి, విడివిడిగా గ్రూపులుగా నిల్చోబెట్టి లెక్క తేల్చాలని కోరడం అన్నమాట. మూజువాణీ ఓటుతో నిర్ణయం తీసుకున్న తర్వాత.. డివిజన్ కోరే హక్కు సాధారణంగా ఉంటుంది. అయితే.. నిర్ణయం వెంటనే దీనిని కోరాలి.
కానీ సోమవారం సభలో మూజువాణీ నిర్ణయం జరిగిపోయాక.. ఆ తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించేశాక.. బడ్జెట్‌పై వివిధ పార్టీల ప్రసంగాలకు సమయం కేటాయించేశాక, చర్చను ప్రారంభించడానికి వైకాపాకు చెందిన ఎమ్మెల్యే రాజేంద్రనాధరెడ్డి లేచి నిల్చున్న తర్వాత.. అప్పుడే తమకు ‘డివిజన్’ గుర్తుకు వచ్చినట్లుగా ఆ పార్టీ సభ్యులు కోరడం వివాదాస్పదం అయింది. మరో అంశంలోకి వెళ్లిపోయిన తర్వాత.. డివిజన్ కుదరదని స్పీకరు చెబుతున్నప్పటికీ.. వైకాపా సభ్యులు పట్టించుకోలేదు. డివిజన్ కావాల్సిందేనంటూ పట్టుపట్టారు.
నిజానికి డివిజన్ అనేది సభలో బలాబలాలు… పోటాపోటీగా ఉన్నప్పుడు ఉపయోగపడవచ్చు గానీ.. ఇంత స్పష్టమైన తేడా ఉన్నప్పుడు దండగ. డివిజన్లో నిర్ణయం మారిపోవడం అసాధ్యం. వైకాపా అవిశ్వాస తీర్మానం నెగ్గడం అసాధ్యం. అయినా సరే, వారు డివిజన్ అడగడం, అది కూడా మరో అంశంలోకి వెళ్లిపోయిన తర్వాత అడగడం చూస్తే తమ తీర్మానం నెగ్గకుండా కుట్ర చేశారని ఆరోపించడానికే అన్నట్లుగా అర్థమవుతోంది.
చూడబోతే.. తాము డివిజన్ కోరినా ఇవ్వలేదని స్పీకరుకు ఆపాదించడానికే వైకాపా ఇలా కోరి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. దానికి తోడు స్పీకరు పై కూడా అవిశ్వాసం పెట్టాలనే యోచనతో వారు ఉన్నందున.. దానికి కాస్త బలం చేకూరడానికి డివిజన్ అడిగినా ఇవ్వలేదని ఆరోపించడానికి ఇలా అసంబద్ధంగా అడిగి ఉంటారని పలువురు అనుకుంటున్నారు.