తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం సహజంగానే సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అగ్గి పుట్టిస్తామని.. సెస్ తగ్గించాలని డిమాండ్ చేస్తామని కలిసి వచ్చే వారందరితో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్, జగన్ మాట్లాడుకుని ఇలా కేంద్రంపై ఒకే రోజు పోరాటం ప్రకటించారన్న అభిప్రాయం వినిపిస్తోది.
జగన్ ఖర్చుతో ప్రకనలు – కేసీఆర్ ఖర్చు లేకుండా ప్రెస్‌మీట్.. మేటర్ ఒకటే !
అచ్చంగా ఈ సెస్ విషయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఆయన కూడా కేంద్రంపై మండిపడ్డారు. అయితే కేసీఆర్‌లాగా ఆయన ప్రెస్‌మీట్ పెట్టి అనర్ఘళంగా ప్రసంగించలేరు .. ఘాటుగా మాట్లాడలేరు .. ఏదైనా చూసి చదవాలి కాబట్టి ఆ టెన్షన్ ఎందుకనుకున్నారేమో కానీ… పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఆ పేపర్ ప్రకటనల్లో అంతా కేంద్రం పెంచిన పన్నులు, వసూలు చేస్తున్న సెస్, రాష్ట్రానికి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న వైనం ఇలా చాలా ఉన్నాయి. అచ్చంగా కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. ఒకే రోజు అటు కేసీఆర్ అటు జగన్ కేంద్రంపై పెట్రోల్, డీజిల్ విషయంలో ఒకే రకమైన ఆరోపణలు చేశారు. అంటే ఇద్దరూ మాట్లాడుకునే ఈ రాజకీయం ప్రారంభించారనే అంచనాలు వస్తున్నాయి. జగన్ ఖర్చుతో ప్రకటనలు ఇస్తే.. కేసీఆర్ ఖర్చు లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు అంతే తేడా అంటున్నారు.
ఎన్నికల వ్యూహాలు అమల్లోకి వచ్చేస్తున్నాయా ?
కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఎంతో ఆసక్తి. ఆయన ఢిల్లీలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అందుకే గతంలో ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. ఏపీలో సీఎం జగన్ గెలిచిన మొదట్లో రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజకీయంగా ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి సబంధాలు ఉన్నాయి. జల వివాదాలు.. ఇతర అంశాల విషయంలో కోర్టులు, ట్రిబ్యూనళ్లకు వెళ్లడం కూడా రాజకీయ వ్యూహమేనన్న అంచనాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎన్నికల మూడ్ వచ్చేస్తోంది. ఐదు రాష్ట్రాలఎన్నికల తర్వాత ఇది మరింతగా పెరగనుంది. అందుకే కేసీఆర్, జగన్ తమ రాజకీయ వ్యూహాలను బయట కలవకుండా ఉమ్మడిగా అమలు చేస్తున్నారని అంటున్నారు.
కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటాలకు జగన్ మద్దతు ఉంటుందా ?
రైతు చట్టాలు, పెట్రో సెస్‌లు , విభజన హామీలు ఇలాంటి వాటిపై కేంద్రంతో కొట్లాడుతామని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులందర్నీ ఢీల్లీకి తీసుకెళ్లి ధర్నా చేస్తామన్నారు. ఇప్పుడు కేసీఆర్ పోరాటానికి వైసీపీ మద్దతు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో కేంద్రం తమకు సహకరించడం లేదన్న అభిప్రాయంలో వైసీపీ అగ్రనాయకత్వం ఉంది. టీడీపీ అధినాయకత్వానికి దగ్గరవుతున్నారన్న అంచనాల్లో ఉన్నారు. దీంతో నేరుగా బీజేపీని ఢీకొట్టాలని నిర్ణయించుకుంటే కేసీఆర్‌తో నడవడానికే ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీతో విబేధించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే అది సహజంగానే ప్రజల్లో సానుభూతి పెంచుతుందన్న నమ్మకంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అందుకే ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది.
మళ్లీ ప్రత్యేక హోదా అందుకేనా ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. బీజేపీ ఎలాగూ ఇవ్వదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి ధర్డ్ ఫ్రంట్ లేదా.. ఇతర కూటముల్లో చేరితే ప్రత్యేకహోదా తీసుకువస్తామన్న హామీని మళ్లీ ప్రజలకు కొత్త ఇవ్వొచ్చని ఆలోచన చేస్తున్నట్లుగా . గతంలో ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిస్తే ఏదైనా సాధించవచ్చని.. ఏపీ ప్రత్యేక హోదాకు తమ మద్దతు అని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికలకూ అదే అస్త్రం ఉపయోగించే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు రాజకీయంగా అసలు గేమ్ ప్రారంభమయిందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.