వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కాస్త రూటు మార్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని బహిరంగంగానే పొగుడుతున్నారు. కేసీఆర్తో స్నేహం చేస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని… విశ్లేషణలు వస్తున్నా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వీరి విషయంలో..జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏమిటి..?
చంద్రబాబు కాంగ్రెస్తో…! బీజేపీతోనే వెళ్లాలని జగన్ ఫిక్స్…!?
విభజన హామీలు అమలు చేయకపోవడంపై… ఏపీ ప్రజల్లో నరేంద్రమోడీపై ఆగ్రహం ఉంది. ఇలాంటి సమయంలో… జగన్మోహన్ రెడ్డి.. జాతీయ మీడియా ఇంటర్యూల్లల్లో మోడీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగు ఉందని నిర్ణయించుకోవాలి. తనపై విమర్శలు తక్కువగా వచ్చేలా.. జాతీయ స్థాయిలో మోడీ బాగా చేశారని.. కానీ ఏపీకి మాత్రం అన్యాయం చేశారని చెప్పుకొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయం కన్నా.. జాతీయ స్థాయిలో మోడీ బాగా చేశారన్నదాన్నే నొక్కి చెబుతున్నారు. మోడీని విమర్శించడం వల్ల కొత్తగా జగన్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. ఇప్పటికే.. చంద్రబాబునాయుడు… మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ వర్గం ఆయనకు మద్దతుగా ఉంటుంది. ఇప్పుడు మోడీపై… జగన్ కూడా విమర్శలు చేస్తే.. చంద్రబాబును బలపరిచినట్లవుతుందని.. అందుకే ఏపీ విషయంలో అన్యాయం చేశారని చెబుతూనే… దేశంలో బాగా చేశారని… జగన్ చెప్పుకొస్తున్నారు. చంద్రబాబునాయుడు… ఏపీలో జగన్ కు ప్రత్యర్థి. ఇప్పటికే… చంద్రబాబు.. కాంగ్రెస్తో టై అప్ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉండాలి..?
జగన్ మిత్రుడని చెబుతున్న బీజేపీ..! ఖండించని వైసీపీ నేతలు..!
భారతీయ జనతా పార్టీ నేతలు కొద్ది రోజులుగా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షమే అని చెబుతూ ఉన్నారు. ఒక్కరంటే.. ఒక్క వైసీపీ నేత కూడా ఈ ప్రకటలను ఖండించలేదు. అవును నిజమే.. తాము బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. బహుశా… వచ్చే ఎన్నికల్లో మోడీనే గెలుస్తారేమో అన్న అంచనాకు… జగన్ వచ్చి ఉండవచ్చు. పుల్వామా దాడి ఘటన అనంతర పరిణామామాలతో.. మోడీపై వ్యతిరేకత తగ్గిందని.. కొన్ని విశ్లేషణలొచ్చాయి. ఈ కోణంలో…. జగన్మోహన్ రెడ్డి.. ఓ అంచనాకు వచ్చి.. నేరుగా.. మోడీకి మద్దతుగా మాట్లాడుతున్నారని భావించవచ్చు. రాష్ట్రంలో.. మోడీ వ్యతిరేకత ఓటు ఉంటుంది. అయితే.. మోడీకి అనుకూలంగా ఉండే కొంత మంది ఓటర్ల మద్దతు అయినా కూడగట్టుకోవచ్చన్న ఆలోచన కూడా.. జగన్ చేస్తున్నట్లు భావించవచ్చు. అందుకే… ఎన్నికలకు ముందు సున్నితమైన అంశం అయినప్పటికీ… కేసీఆర్ తో పాటు.. మోడీపైనా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఢిల్లీలో మోడీకే మద్దతు అనేది జగన్ విధానం…!
జాతీయ రాజకీయాల దృష్టితోనూ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావించవచ్చు. ఆయన ప్రొ బీజేపీ. ఇది టీడీపీ చేస్తున్న విమర్శ. దీన్ని తన మాటలతో ఆయన నిజం చేస్తున్నారు. అయితే… ఇక్కడ ఆయన చంద్రబాబు స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ స్థాయిలో సమర్థిస్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదు. అలాగే.. జగన్మోహన్ రెడ్డి కూడా… రాష్ట్ర స్థాయిలో బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి.. ఢిల్లీలో మాత్రం.. ఆ పార్టీని సమర్థించాలనుకుంటున్నారు. అందుకే.. ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో క్లారిటీ ఉంది కనుక.. సానుకూలంగా ప్రకటనలు చేసినప్పటికీ.. కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని… జగన్ భావిస్తూ ఉండవచ్చు.