వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు తల్లి, చెల్లిపై ప్రేమ , ఆప్యాయతలు పోయాయి కాబట్టి తాను గతంలో రాసిచ్చిన సరస్వతి పవర్ వాటాలు తనకు ఇచ్చేయాల్సిందేనని ఎన్సీఎల్టీలో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలోనే జగన్ గురించి చెబుతున్నారు. జగన్ రెడ్డి ఆలోచనలు ప్రపంచంలో ఎవరికీ రానంత వింతగా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన వేసిన అఫిడవిట్ కూడా అంతే ఉంది. ప్రేమ, ఆప్యాయలతో రాసిచ్చాను కాబట్టి.. ఇప్పుడు అవి పోయాయని అంటున్నారు. అందుకే తనవి తనకు ఇచ్చేయాలని ఎన్సీఎల్టీలో కేసువేశానని అంటున్నారు.
అసలు సరస్వతి పవర్ మొత్తం తమదేనని విజయమ్మతో పాటు డైరక్టర్ గా ఉన్న చాగరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి అఫిడవిట్లు దాఖలు చేశారు. తనను ప్రతివాదిగా జగన్ చేర్చడం సరి కాదని సరస్వతి పవర్ లో తనకు ఇంకా వాటాలు రాలేదని షర్మిల కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్ వేసిన పిటిషన్.. దాఖలు చేసిన అఫిడవిట్ చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తన చెల్లి అక్రమాలకు పాల్పడుతూంటే..తన తల్లి సమర్థిస్తోందని.. జగన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్న అక్రమాలు అక్కడ జరగలేదని విజయలక్ష్మితో పాటు ఇతరులు కూడా సాక్ష్యాలు చూపిస్తున్నారు. కానీ చేసిన ఆరోపణలకు మాత్రం.. జగన్ ఆధారాలు చూపించకుండా తనకు తల్లిపై ప్రేమ పోయిందంటున్నారు.
సరస్వతి పవర్ అనేది ఇంకా పేపర్లపైనే ఉన్న కంపెనీ. కానీ ఆ కంపెనీ పేరుతో చాలా భూముల్ని సేకరించారు. వాటి విలువ చాలా ఉంటుంది. అందుకే ఆ భూముల కోసమైనా కంపెనీని వెనక్కి తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారు. షర్మిల రాజకీయాల్లోకి వచ్చి తన దారి తాను చూసుకోవడంతో ఆమెను ఆర్థికంగా దెబ్బకొట్టాలని గతంలో రాసిచ్చినవి వెనక్కి తీసుకునేందుకు పిటిషన్ వేశారు. కానీ జగన్ చెల్లికి రాసివ్వలేదు. అంతర్గతంగా ఏం జరిగిందో కానీ తల్లి పేరునే రాశారు. జగన్ వాదనపై ఎన్సీఎల్టీ స్పందన కీలకంగా మారనుంది.