వైఎస్ జయంతి అంటే వైసీపీకి మమూలుగా పండగ కాదు. జగన్కు కూడా. గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జయంతి రోజు ప్రజల డబ్బు కనీసం వంద కోట్లు ఖర్చయిపోయేది.
అంతేనా పార్టీ నేతలకూ చేతి చమురు వదిలేది. సాక్షి పత్రికకు పండగ వచ్చేది. మంత్రుల దగ్గర నుంచి మైనింగ్ వ్యాపారుల వరకూ అందరూ తమ స్థాయిలో తాము ఎంతో కొంత ప్రకటనల రూపంలో సాక్షికి ముట్టచెప్పేవారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. వైఎస్ఆార్ ను పట్టించుకునేవారు వైసీపీలో లేరు. చివరికి జగన్ కూడా.
ఇడుపులపాయలో పొద్దున్నే వెళ్లి ఓ నమస్కాం చేసి వచ్చేస్తారు జగన్. ఆ తర్వాత పార్టీ నేతలు ఎవరైనా … వైఎస్ జయంతి పేరుతో పూలు, పండ్లు పంచితే ఆ ఫోటోలు సాక్షి మీడియాలో ప్రసారం చేస్తారు. అంతే తప్ప పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమం చేయడం లేదు. వైఎస్ ను ఒక్క సారిగా ఎందుకు తమ పార్టీకి చెందిన నేతగా వైసీపీ భావించడం లేదో ఆ పార్టీ క్యాడర్ కు అర్థం కావడం లేదు. వైఎస్ ను గౌరవించే పేరుతో లేనిపోని వివాదాల్ని ఆయన మెడకు చుట్టి.. ఎక్కడైనా విగ్రహాలు కనిపించినా ఇక్కడెందుకు తీసేయాలి కదా అని ప్రతి ఒక్క మనసులో అనిపించేలా పాలన చేశారు జగన్. ఇప్పుడు ఆయన కూడా అదే భావనలో ఉన్నారు.
వైఎస్ ను జగన్ కన్నా షర్మిల ఎక్కువ అగ్రెసివ్ గా ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. కానీ సాక్షిలో చిన్న సైజ్ యాడ్ కూడా లేదు. ఒక్క షర్మిల కాదు.. ఏ ఒక్క వైసీపీ నేత ఇవ్వలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి సంపాదించుకున్న వారు సైలెంట్ అయిపోయారు. జగనే అలా ఉంటే తమకు ఎందుకని వారి భావన. జగన్ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారో… లేక షర్మిల ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారో కానీ ఇప్పుడు మెల్లగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా మారుతున్నారు. ఇది రాను రాను కొన్ని కీలక రాజకీయ పరిణామాలకు మూలం కానుంది.