వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు..? ముఖ్యమంత్రి. ఆషామాషీ ముఖ్యమంత్రి కాదు.. ఏకంగా.. 151 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ముఖ్యమంత్రి. ఆయన ఎమ్మెల్యేలందరూ నిలబడితే.. ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కూడా కూర్చోలేరు. అలాంటి.. అధికారులకు ధైర్యం ఉంటుందా..?. ఉండదు.. ఉండకూడదు. ఇదే విషయాన్ని ఆయన కేబినెట్ భేటీలో నిరూపించారన్న చర్చ ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్ అయిపోయింది. గురువారం ఉదయం కేబినెట్ భేటీలో.. జగన్ అధికారులకు మధ్య జరిగిన ఓ మాదిరి సంవాదమే ఈ టాపిక్ హాట్ అవడానికి కారణం. మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటినీ వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించి స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిస్తామని తన పాదయాత్ర సమయంలోను, ఆ తర్వాత వైసీపీ మేనిఫెస్టోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా ఆయన బిల్లును రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
బిల్లును రూపొందించి అధికారులు కేబినెట్ సమావేశానికి తీసుకొచ్చారు. అయితే కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఉదయలక్ష్మి ఇది ఆచరణ సాధ్యంకాదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. ఓ అధికారి తాను చెప్పిన బిల్లు ఆచరణ సాధ్యం కాదని అనడంతో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహించారని చెబుతున్నారు. తాను హామీ ఇచ్చానని చెప్పినట్లు బిల్లు తేవాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని మరికొంతమంది అధికారులు సీఎం జగన్ కు వివరించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ వినిపించుకోలేదు. తాను చెప్పినట్లు బిల్లు తేవాల్సిందేనని చెప్పేసారు.
ఇక సీఎంకు సలహాలివ్వడం అనవసరం అనుకున్న అధికారులు.. జగన్ చెప్పినట్లే… బిల్లు తయారు చేసి తీసుకొచ్చారు. ఈ బిల్లును అమలు చేయటం సాధ్యంకాదని, కొన్ని పరిశ్రమల్లో నైపుణ్యం ఆధారంగా స్కిల్ వర్కర్లను తీసుకోవాల్సి వస్తుందని, పైగా ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటం అనేది ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వానికి అనవసరమైన తలనొప్పులు తెచ్చిపెడతాయని ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు. అయినా సీఎం మాత్రం.. దీన్ని చట్టంగా తేబోతున్నారు.