ఆరు నెలల పాలన బెంచ్ మార్క్ అందుకున్న రోజు… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. మరో హామీ అమలు చేయడానికి విధివిధానాలు ఖరారు చేశారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్తో పాటు… వారికి ఖర్చుల కోసం.. ఏటా రూ. పది నుంచి ఇరవై వేల వరకూ ఇస్తామన్న హామీకి విధివిధానాలు ప్రకటించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలయిన సందర్భంగా ఉత్తర్వులు జారీచేసింది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు. వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందిస్తారు.
వసతి దీవెన కింద ఐటీఐ చదివే విద్యార్థికి ఏటా రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు ఇస్తారు. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తారు. 2.50 లక్షలు లోపు ఆదాయం ఉన్న పేద కుటుంబలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంతో పాటు.. విద్యార్థులకు ఏటా రూ. ఇరవై వేల వరకూ చెల్లిస్తామనే హామీ కూడా ఉంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడే విద్యాసంవత్సరం ప్రారంభం అవుతోంది.
ఈ పథకం అమలు గురించి.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో… ఫీజులు కట్టి జాయినయ్యారు. ఆరు నెలల తర్వాత ఇప్పుడు పథకాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తామని ప్రకటించడంతో.. విద్యార్థులు కట్టిన ఫీజులు ఆయా కాలేజీలు వెనక్కివ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం కాలేజీలకు నిధులు చెల్లిస్తే.. కాలేజీలు ఆ పని చేయవచ్చు.