ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కోతలకు వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ కరెంట్ స్తంభానికి ఢీకొట్టడతో పది మంది చనిపోయారు. ఇది హృదయవిదారక ఘటన. అందరూ నిరుపేద కూలీలే. ఇంత కాలం.. లాక్ డౌన్ కారణంగా పొలాల్లోకి వెళ్లడానికి కూడా పర్మిషన్ దొరకలేదు. ఇప్పుడు అరకొర ఉపాధి దొరుకుతుందని వెళ్తే మొత్తానికే ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం తరపున ” దిగ్భ్రాంతి ” వ్యక్తం చేస్తూ ప్రకటన వచ్చింది. దాంతో పాటు మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామన్న సందేశం కూడా వచ్చంది. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
గత గురువారమే.. విశాఖలో ఎల్జీ పరిశ్రమ నుంచి ప్రమాదకర రసాయనాలు లీక్ కావడంతో పన్నెండు మంది చనిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వారిని పరామర్శించి.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. అందరూ ఆయనను అభినందించారు. అయితే.. ఇప్పుడు అదే ఉదారత ఎందుకు చూపడం లేదనే ప్రశ్న.. ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో వస్తోంది. పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు… రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. నిన్న ఆయన ప్రకటించి ఉండవచ్చు.. ఈ రోజు నుంచి వివిధ రాజకీయ పక్షాల డిమాండ్ కూడా అదే అయ్యే అవకాశం ఉంది.
ప్రైవేటు కంపెనీ చేసిన నిర్లక్ష్యానికి ప్రభుత్వం విలువ కట్టింది. హడావుడిగా ప్రజా ధనాన్ని విడుదల చేసి.. కంపెనీపై ప్రజలకు కోపం పెరగకుండా.. వీలైనంతగా ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోతున్న ప్రాణాలకు మాత్ర..ఆ స్థాయిలో విలువ కట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా నిరుపేద కూలీలే. వారి ఆర్థిక స్థోమతను బట్టి నష్టపరిహారం డిసైడ్ చేస్తే.. అది విధానలోపమే. ఈ విషయంలో ప్రభుత్వం మెరుగైన విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉంది.