ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి తెస్తోంది. ఇకపై ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను రెండు నెలల్లోగా జీపీఎస్ లను అమర్చాలనీ, ఇప్పుడున్న ధరకంటే తక్కువకే ఇసుక అమ్మాలని ఆదేశించారు. ఈ విక్రయాల్లో ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకూడని విధానాలు రూపొందించాలని సీఎం చెప్పారు. ఇకపై ఇసుక రీచ్ ల దగ్గర ఒక స్టాక్ యార్డ్, పట్టణాల్లో మరో స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతీచోటా రసీదు లభించాకనే ఇసుక తరలింపునకు అనుమతులుంటాయి. అలాగే, ఇసుక యార్డుల దగ్గర, తవ్వే చోట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు పెడతారు. దళారులకు ఎక్కడా ప్రమేయం లేకుండా చేయనున్నారు. అక్రమ రవాణాకు ఏమాత్రమూ ఆస్కారం ఉండకూదన్నది వైకాపా సర్కారు లక్ష్యం. ఇసుకపై ప్రతీపైసా ప్రభుత్వానికి చేరే విధంగానే ఈ నిర్ణయం ఉందని చెప్పొచ్చు.
నిజానికి, గత టీడీపీ సర్కారు హయాంలో ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో వైకాపా ఆరోపణలు చేసింది. ఇసుక నుంచి మట్టి దాకా అన్నీ దోచేశారంటూ నాడు జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా విమర్శించేవారు. అయితే, ఇసుక విక్రయాల విషయంలో స్థానిక నేతల దగ్గర్నుంచీ ఎమ్మెల్యేల వరకూ గతంలో ఎన్నో తగాదాలు చోటు చేసుకున్నాయి. మొదట్ల డ్వాక్రా సంఘాలకు ఇసుకను విక్రయించే అధికారం ఇచ్చారు. అక్కడి నుంచే తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇసుక విక్రయాల్లోకి నాయకుల తాకిడి పెరిగిపోయింది. ఓ దశలో ఇవన్నీ పడలేక ఇసుకను ఏకంగా ఫ్రీ అనేశారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు. ఉచితం అని ప్రభుత్వం ప్రకటించిందేగానీ, రకరకాల పేర్లతో చార్జీలు ఖర్చులు ప్రజలకు తప్పలేదు.
ఇప్పుడు కొత్తగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను అమ్మడం. ఇసుక తవ్వకాలకీ, రవాణాలకీ వాడే వాహనాలకు జీపీఎస్ లు, సీసీ కెమెరాలు, రీచ్ ల దగ్గర నిఘా, దళారుల ప్రయమేయం తగ్గింపు… ఇవన్నీ గత ప్రభుత్వం కూడా మొదట్లో పక్కాగా అమలు చేద్దామనుకున్న అంశాలే. అయితే, ఇసుక రవాణాపై పూర్తి అదుపును గత ప్రభుత్వం సాధించలేకపోయిందన్న విమర్శలున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం ఇప్పుడు జగన్ సర్కారు చేయబోతోంది. నేరుగా ప్రభుత్వ ఖజానాకే ఇసుక నుంచి వచ్చే ఆదాయం చేరేలా చేయాలనేది మంచి ఆలోచనే. క్షేత్రస్థాయిలో ఇసుక దందాపై పూర్తి నియంత్రణ సాధించగలిగితే… ప్రభుత్వానికి ఇది మంచి ఆదాయవనరు అవుతుంది.