ఆంధ్రప్రదేశ్‌కు టీకాలు ఎక్కువ ఎందుకు రావడం లేదు..? ఈ ప్రశ్నకు అందరూ రకరకాలుగా సమాధానం చెబుతున్నారు. కేంద్రం ఎన్ని పంపితే… లేకపోతే ఎన్ని కొనమంటే అన్నే కొనాలని ప్రభుత్వం చెబుతోంది. కొనే చాన్స్ ఉన్నా.. ఆర్డర్లు పెట్టడం లేదని.. డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ప్రజల ప్రాణాలతో ఆడుకుటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ రెండింటి మధ్య ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అదేమిటంటే.. భారత్ బయోటెక్ చంద్రబాబు బంధువుల కంపెనీ అట.. అందుకే.. కోవాగ్జిన్ టీకాను ఏపీకి ఎక్కువగా ఇవ్వడం లేదట. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. మాట్లాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ.. కొత్త కాదు.
భారత్ బయోటెక్ యజమానులు… తమిళనాడుకు చెందిన వారు. వారి సామాజికవర్గం ఏమిటో తెలియదు కానీ.. రామోజీరావు కుటుంబంతో వియ్యమందుకున్నారు. అంత మాత్రానికే.. వారికి చంద్రబాబు బంధువులని లింక్ పెట్టి ఆ కారణంగానే ఏపీకి కోవాగ్జిన్ ఇవ్వడం లేదని అనేశారు. అంటే ముఖ్యమంత్రి ఉద్దేశంలో ఒకే కులం అని అర్థం అన్నమాట. అదే సమయంలో.. కోవాగ్జిన్ లేకపోతే… కోవిషీల్డ్ అయినా తెచ్చుకోవచ్చు కదా అని వచ్చే సందేహానికి ఆయన సమాధానం ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలనా పరమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. వ్యాక్సిన్‌కూ కుల ముద్ర వేసే ప్రయత్నం చేయడం.. ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి ఏ సమస్య వచ్చినా… సామాజికవర్గం స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. వ్యాక్సిన్ల కొరతకూ అదే ప్లాన్ వాడేస్తున్నారు. ప్రజలు మరో రకంగా అనుకుంటారన్న ఆలోచన చేయడం లేదు.