ముఖ్యమంమత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవకాశం దొరికినా…విశాఖ ను ప్రమోట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వర్చువల్ పద్దతిలోజరిగింది. ఈ ప్రారంభోత్సవరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. గడ్కరీకి విశాఖ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకమైన విజ్ఞప్తులు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని… అందుకే అక్కడ రోడ్డు ప్రాజెక్టులు చేపట్టాలని గడ్కరీని జగన్ కోరారు. బోగాపురంలో ప్రపంచ స్థాయి ఎయిర్ పోర్టు వస్తోందని.. విశాఖ నుంచి బోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖలో రోడ్ల అభివృద్ధి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. బీచ్ రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని గడ్కరీని జగన్ కోరారు. మూడు రాజధానుల బిల్లు విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టులో ఉంది. అయినప్పటికీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గానే జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్త్తున్నారు. ఎవరేమనుకున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారీ ఎత్తున స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారు.
బోగాపురం ఎయిర్ పోర్టు కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల నుంచి ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని అక్కడ ఎలాంటి సిటీ కట్టవచ్చో… ఆర్కిటెక్చర్ నిపుణులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో… కేంద్రం నుంచి ప్రాజెక్టులను కూడా విశాఖ కోసమే అడుగుతున్నారు జగన్. ఇతర ప్రాంతాల్లోని రోడ్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలను సీఎం ఎందుకు గడ్కరీ ముందు పెట్టలేదని.. ఒక్క విశాఖపైనే ఎందుకు మొత్తం దృష్టి కేంద్రీకరిస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లో నడుస్తోంది.