కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన కేంద్రం సాయం కావాలని అడిగారు. అడిగిన పద్దతే భిన్నంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని….తాము వెనుకబడి ఉన్నామని సాయం చేయాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు మాకు మహా నగరాలు లేవని… భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులు లేవని చెప్పుకొచ్చారు. వైద్య సదుపాయాలను మెరుగు పరచడానికి సహకరించాలని కోరారు.
అదే సమయంలో..ఏపీ కరోనా కట్టడికి అద్భుతంగా పని చేసిందని..చెప్పుకొచ్చారు. ఏపీలో మరణాల రేటు 0.89శాతంగా మాత్రమే ఉందనన్నారు. కోవిడ్ క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం పరీక్షలు చేస్తున్నామని …సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసుల్ని గుర్తిస్తున్నామన్నారు. కరోనా వచ్చేనాటికి ఒక్క టెస్టింగ్ ల్యాబ్ కూడా లేదని.. ఇప్పుడు ప్రతి 10 లక్షల మందికి 47 వేలకుపైగా టెస్టులు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ పాతిక లక్షలకుపైగా టెస్టులు చేశామన్నారు. 2 లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ఉన్నారని ప్రధానికి తెలిపారు.
ప్రస్తుతం దేశంలో పదిరాష్ట్రాలలో కరోనా తీవ్రంగా ఉందని ఆ రాష్ట్రాల్లో కంట్రోల్ చేయగలిగితే..వైరస్ కంట్రోల్ అవుతుదని కేంద్రం భావిస్తోంది. ఈ పది రాష్ట్రాల్లో ప్రథమంగా ఏపీ ఉంది. ఏపీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ ప్రత్యేకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.