రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై గతంలో సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. దాదాపుగా పది రోజుల సమయం ఇచ్చినప్పటికీ.. అటు సీబీఐ కానీ.. ఇటు జగన్ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. రెండు పార్టీలు కూడా.. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోర్టును కోరాయి. దీంతో విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన కేసుల్లో ఉన్న సహ నిందితులు, సాక్ష్యాలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని.. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించి.. నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో సీబీఐ వాదనపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏమని కౌంటర్ వేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సీబీఐ కూడా.. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారన్న వాదనతో ఏకీభవిస్తే సంచలనం అవుతుంది. నిజానికి సీబీఐ విచారణకు జగన్ ఎప్పుడూ సహకరించలేదు. విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడుతున్నారని సీబీఐ పలుమార్లు హైకోర్టులోనే వాదనలు వినిపించింది. ఇలాంటి సమయంలో… కళ్ల ముంద కనిపిస్తున్న కొన్ని అంశాలను కొట్టి పారేసి..జగన్ బెయిల్ కొనసాగించవచ్చని సీబీఐ నివేదిక ఇస్తే.. అనేక సందేహాలు ప్రజలకు వస్తాయి. అందుకే… సీబీఐ వేసే కౌంటర్పై చాలా మంది ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. కానీ సీబీఐ సమయానికి కౌంటర్ వేయలేకపోయింది.
మరో వైపు … తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని గట్టిగా వాదించుకోవడం తప్ప.. మరో పరిస్థితి లేని జగన్ రెడ్డి లాయర్లు కూడా… కౌంటర్ దాఖలుకు సమయం అడిగారు. విచారణ ఆలస్యం చేయడానికే.. ఇలా సమయం అడిగారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ వల్ల.. రాను రాను కేసుల విచారణలు ఆలస్యమవుతాయని… మరో పది రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని.. జగన్ లాయర్లు అనుకుని ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి.. రఘురామకృష్ణరాజు … ప్రతివాదులు కొంటర్ వెంటనే వేయలేనంత గట్టిగానే పిటిషన్ వేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.