విశాఖ ఎయిర్ పోర్ట్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి పై విచారణను ఎన్ఐఏ కు అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబరు 25 వ తేదీ ఈ దాడి తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సాక్షాత్తు డిజిపి విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాడి చేసిన యువకుడు వై ఎస్ ఆర్ సి పి అభిమాని అని చెప్పడం, తన దగ్గర ఒక ఉత్తరం దొరికిందని చెప్పడం, ఆ ఉత్తరాన్ని అప్పుడు మీడియాకు విడుదల చేయకుండా చాలా సేపటి తర్వాత విడుదల చేయడం, అంతేకాకుండా తెలుగుదేశం నాయకులు జగన్ స్వయంగా తనపై తానే దాడి చేయించుకున్నాడని వ్యాఖ్యానించడం, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి తెలుగుదేశం నాయకులు ఒకడుగు ముందుకు వేసి జగన్ తల్లి విజయమ్మ ఈ దాడి చేయించిందని వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగితే తమకు న్యాయం జరగదని భావించిన వైఎస్సార్సీపీ నేతలు, ఎయిర్ పోర్టు లో జరిగిన ఈ దాడి ఘటన విచారణ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బదిలీ చేయాలని కోరారు.
ఇప్పుడు ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6 ప్రకారం, ఎయిర్ పోర్టు లో జరిగే ఘటనలు రాష్ట్ర పోలీసుల పరిధిలోకి రావు కాబట్టి విచారణ కూడా ఇలాంటి సంస్థ ఆధ్వర్యంలోని జరగాలని కోరిన పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అలాగే కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని పిటిషనర్ చేసిన వాదనతో కూడా హైకోర్టు ఏకీభవించింది.
మొత్తానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.