ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో 151 చోట్ల… ఘన విజయం సాధించిందనే విషయం.. దేశవ్యాప్తంగా ఎంతో చర్చను రేకెత్తించింది. ప్రగతిశీల ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ప్రచారం పొందిన చంద్రబాబుపై.. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని.. ఎవరూ ఊహించలేకపోయారు మరి. అయితే..అది చంద్రబాబుపై వ్యతిరేకతో.. జగన్ పై వెల్లువెత్తిన సానుభూతో.. లేక కలసొచ్చిన కాలమో.. ఏదయితేనే.. అంతిమంగా .. విజయమే లెక్కలోకి వస్తుంది. అది జగన్‌కు దక్కింది. కానీ.. రెండు నెలలు పూర్తి కాక ముందే.. ఆ విజయాన్ని పూర్తిగా తలకెక్కించుకుని.. నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంది జగన్ వ్యవహారశైలి. అంతా నా ఇష్టం అంటున్నట్లుగా ఆయన చేస్తున్న చట్టాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
పరిణామాలు ఆలోచించకుండా నిర్ణయాలా…?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు… ఆషామాషీవి కావు. రాష్ట్ర భవిష్యత్‌ను తీవ్రంగా ప్రభావితం చేసేవే. అత్యంత కీలకమైన విధానపరమైన నిర్ణయాలు.. కనీస చర్చ లేకుండా.. సొంతంగా తీసేసుకున్నారు. మంచీ చెడూ చెప్పబోయిన అధికారులను కూడా ఆయన కసురుకున్నారు. తాను ముఖ్యమంత్రినని.. తాను చెప్పింది జరగదా.. అన్న డైరక్ట్ వార్నింగ్‌తో.. పని చేయించేసుకున్నారు. ఇక ఎవరైనా ఏం చేయగలరు. ప్రభుత్వంపై రూపాయి భారం పడని ప్రాజెక్ట్ అమరావతిని నిలిపివేస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచించారా..? పోలవరంపై అవినీతి ముద్ర వేస్తే రివర్స్ టెండరింగ్ అంటే.. మళ్లీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందో లేదో .. నిపుణులతో చర్చించారా..? స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిస్తే.. పారిశ్రామికవేత్తల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారా..? ఏమీ చేయలేదు.. అంతా నా ఇష్టం అన్నట్లుగా నిర్ణయాలు తీసేసుకున్నారు. చట్టాలు చేసేశారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే.. ఒక్కరు కూడా స్వేచ్చగా అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోయారు.
భావితరాలకు నీటి సమస్య వస్తే బాధ్యత ఎవరిది..?
తెలంగాణ సర్కార్‌తో గోదావరి జలాలు పంచుకునేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం… సాగునీటి రంగంలో.. కనీస అవగాహన ఉన్న వారికైనా… ” రబ్బిష్” అనిపించక మానదు. కానీ.. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది అద్భుతంగా అనిపిస్తోంది. ఆంధ్ర సొమ్ము పెట్టి.. తెలంగాణలో ప్రాజెక్టులు కడతారు. అది కూడా.. ఎత్తి పోసేది.. తెలంగాణలోనే. చివరికి శ్రీశైలంకి నీటిని చేర్చుతారు. కానీ అక్కడిదాకా వచ్చే అన్ని నీళ్లు లేకపోతే… మధ్యలో.. తెలంగాణ మళ్లీ.. ఎత్తి పోసుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటే.. ఎవరికి నష్టమో… సీఎం ఆలోచించలేకపోయారు. అలాంటి ప్రాజెక్టు కడితే.. గోదావరి నికర జలాలపై ఏపీకి ఉన్న సంపూర్ణ హక్కులు.. కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అదే పోలవరంపై దృష్టి పెట్టి.. దాన్ని పూర్తి చేస్తే.. ఏపీకి అసలు నీటి కొరతే ఉండదని .. అందరికీ తెలిసిన మాట. కానీ జగన్.. రెండు కొండల మధ్య ప్రాజెక్టులు కట్టే రోజులు పోయాయని.. అసెంబ్లీలోనే ప్రకటించి అందర్నీ భయపెట్టేస్తున్నారు.
రాజకీయ కక్షలతో ప్రజలకు అన్యాయం చేస్తే ఎలా..?
గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి.. ప్రజలంతా.. తెలుగుదేశం పార్టీ వాళ్లేనని.. వాళ్లపై ఇప్పుడు… తాను గెలిచినప్పటికీ.. కసి తీర్చుకోవాలన్నట్లుగా ఉంది.. ఏపీ ముఖ్యమంత్రి శైలి. కాపులకు.. ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే.. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినా… ఒక్క జీవోతో రద్దు చేసి పడేశారు. ఆశావర్కర్ల దగ్గరనుంచి.. కాంట్రాక్ట్ ఉద్యోగాల వరకూ.. ఎవరికీ భరోసా లేకుండా పోయింది. రోజుకు వందల మందిని తీసేస్తున్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. లక్షల మంది కార్మికు కుటుంబాలు.. ఆకలితో అలమటిస్తున్నాయి. ఇప్పటి వరకూ.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అన్న ప్రకటనలే కానీ… ఒక్క రత్నమూ ప్రజలకు చేరలేదు. ఇదంతా.. రాజకీయ కక్షతో చేస్తున్నదే కానీ… ఏ మాత్రం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదేమీ కాదు.
పాలకుడు.. ప్రజల పట్ల సానుభూతితో ఉండాలి. కానీ… వారిపై కసి తీర్చుకునేందుకన్నట్లుగా ఉండకూడదు. అధికారం వచ్చింది కాబట్టి.. అంతా నా ఇష్టం అనుకుంటే… ఎప్పటికీ.. మంచి పాలకులు కాలేరు. ప్రజల కష్టాల నుంచి తొలగించకపోయినా పర్వా లేదు.. కానీ కష్టాలు తెచ్చి పెట్టేవారే పాలకులయితే.. అది ప్రజాస్వామ్యానికే మచ్చలాంటిది..!