ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిపక్ష పార్టీల అధినేతలు పిలిస్తే పలికేలా ఉండాలి. అది ప్రజలకు అయినా సొంత పార్టీ నేతలకు అయినా. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ ప్రభుత్వ వ్యవహారాలతో సమయం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ వాణి వినిపించడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఓ మంచి అవకాశం దొరుకుతుంది. కాని ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షం కాని ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ప్రజలకు ఎంత వరకు అందుబాటులో ఉంటుంది అనేది ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఓ అంతు చిక్కని ప్రశ్న.
ముఖ్యంగా ఆ పార్టీ నేతలు ఏవైనా కార్యక్రమాలు చేయాలన్నా సరే అధినేత జగన్ కు ఎక్కడ కోపం వస్తుందో, చెప్పకుండా ఎందుకు చేసారు అంటారో అని సైలెంట్ అయిపోతున్నారు. ఇక జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. బెంగళూరు నుంచే ఓ రకంగా పార్టీని నడుపుతున్నారు. 13వ సారి బెంగళూరు వెళ్లి బెజవాడలో ఫ్లైట్ దిగారు జగన్. శుక్రవారం సాయంత్రం బెంగళూరు వెళ్ళడం, మంగళవారం ఉదయం రావడం దాదాపుగా ఇదే జరుగుతోంది. వాస్తవానికి ఆ పార్టీ నేతలకు కూడా సమాచారం ఉండటం లేదు.
గతంలో రేడియోల్లో వార్తలు వచ్చేవి… ఆకాశవాణి విజయవాడ కేంద్రం, హైదరాబాద్ కేంద్రం అని. వైసీపీకి ఇప్పుడు బెంగళూరు కేంద్రం అయింది. జగన్ వస్తున్నారని పలానా జిల్లా నేతలు తాడేపల్లి రావాలని, జగన్ ఆదేశాలు పాటించాలని… పార్టీలో ఓ కీలక వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇస్తారు. వాళ్ళు ఎక్కడున్నా తాడేపల్లిలో హాజరు వేయించుకోవాలి. కొంత సమయం కేటాయించి… వారానికో ఓ జిల్లా నేతలతో కాసేపు మాట్లాడి… వాళ్లకు పలు ఆదేశాలు ఇస్తారు. మీడియాతో మాట్లాడమంటే మాట్లాడి వెళ్లిపోవాలి. మళ్ళీ జగన్ పిలిస్తే తాడేపల్లి రావాల్సి ఉంటుంది.
ఇటీవల కొడాలి నానీ, పేర్ని నానీ చేసింది అదే. అసలు ఎక్కడ ఉన్నారో తెలియని, పోలీసులు వెతికినా దొరకని వల్లభనేని వంశీ తాడేపల్లిలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏదైనా చెప్పాలన్నా సరే జగన్ అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. గతంలో ప్రతిపక్ష నేతలు అందరూ ప్రజల్లో ఎక్కువగా ఉండేవారు. జగన్ కూడా ప్రతిపక్ష నేతగా ప్రజల్లో అప్పట్లో తిరిగారు. ఇప్పుడు ప్రజల మీద కోపమో లేక ఎన్నికలప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారో గెస్ట్ గా వచ్చి గెస్ట్ గానే వెళ్ళిపోతున్నారు. నేతల అభిప్రాయాలు, వారి సమస్యలు, వారు చేయబోయే కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేయకపోతే బాలినేని, సామినేని, మోపిదేవి తరహాలో నమ్మకమైన నేతలు గుడ్ బై చెప్పడం పెద్ద మేటర్ కాదు.