మళ్లీమళ్లీ అదే జరుగుతోంది..! ఆంధ్రాలో టీడీపీకి వ్యతిరేకంగా ఏదైనా పెద్ద ఇష్యూ రైజ్ అయితే పవన్ కల్యాణే తెరమీదికి వస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడీ ప్రత్యేక హోదా పోరాటమే చూడండీ… మొత్తం ఫోకస్ అంతా పవన్ కల్యాణ్ వైపే తిరుగుతోంది. ట్వీట్లనీ పాటలనీ గడచిన నాలుగైదు రోజులుగా చాలా హడావుడి సృష్టించారు. విశాఖ తీరంలో 26న జరుగుతున్న ఉద్యమానికి పరోక్షంగా పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తున్నట్టు చిత్రీకరణ జరిగిపోయింది! ఇది ఇవాళ్ల కొత్తగా జరిగింది కాదు. మొన్నమొన్నటి ఉద్దానం ఇష్యూ… అంతకుముందు తొందుర్రు ఆక్వా రైతుల ఇష్యూ… ఆ ముందు రాజధాని ప్రాంత బలవంతపు భూసేకరణ ఇష్యూ.. ఇవన్నీ పవన్ చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతోంది. ఈ రేసులో జగన్ ఎందుకు వెనకబడుతున్నట్టు..? ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటూ వస్తున్న ప్రతిపక్షం, చివరి నిమిషానికి వచ్చేసరికి రేసులో ఎందుకు నిలబడుతున్నట్టు..?
గడచిన రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఎన్నో పోరాటాలు జగన్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అంశమై మొదట్నుంచీ జగనే పోరాడుతున్నారు. టీడీపీ చేతులెత్తేశాక ఆ ఇష్యూని భుజానేసుకున్నారు. రకరకాల ఉద్యమాలు చేశారు. నిరసనలు తెలిపారు. ఇప్పుడు జల్లికట్టు నేపథ్యంలో తమిళుల స్ఫూర్తితో మనం ఉద్యమిద్దామని ముందే పిలుపునిచ్చారు. ఎంపీల రాజీనామాకు ప్రతిపాదించారు. విశాఖలో యువత చేపడుతున్న ధర్నాకీ మద్దతు ఇచ్చారు. ఇంతచేసినా.. చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇదంతా చూస్తుంటే ప్రతీ అంశంలోనూ జగన్ ను వెనక్కి నెట్టేందుకు వ్యూహాత్మంగా జరుగుతున్న రాజకీయ కుట్రలా అనిపిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో వైకాపా కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్ ప్రసంగాల్లో వ్యూహాల్లో కొంత మార్పు అవసరమనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.
తాను ముఖ్యమంత్రి అయ్యాక సమస్యలుండవనీ, వైకాపా అధికారంలోకి వస్తేగానీ పరిష్కారం కావని పదేపదే జగన్ చెబుతూ ఉంటారు. ఇందులో ప్రజల తరఫున పోరాటం కంటే వైకాపా అధికార యావ కాస్త ఎక్కువగా ధ్వనిస్తోందన్న భావన కొంతమందిలో ఉంది. జగన్ వస్తే తప్ప స్పందించలేని అసహాయత కిందిస్థాయి నాయకుల్లో ఉంది. ఇలాంటి చిన్నచిన్న లోపాలే అవరోధాలుగా మారుతున్నాయి. జగన్ ఎన్ని ఉద్యమాలు చేపడుతున్నా.. చివరి నిమిషంలో ప్రజల దృష్టిని మళ్లించే శక్తులకు ఆస్కారం ఇస్తున్న అంశాలుగా ఉంటున్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. ఏపీలో ప్రతిపక్షానికి అశేష జన మద్దతు ఉంది. అంత ఉంది కాబట్టే… అధికార తెలుగుదేశం రకరకాల ఎత్తుగడలు వేసి, జగన్ ను పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. ఇప్పటికైనా, ఈ పొలిటికల్ రేసులో జగన్ వ్యూహాలు కాస్త మార్చుకోవాలన్నది విశ్లేషకుల అభిప్రాయం.