ప్రతి నియోజకవర్గానికి అదనంగా ఓ సమన్వయకర్తను నియమించాలని జగన్ .. ఐ ప్యాక్ సలహాతో నిర్ణయించారు . పార్టీ నేతల మధ్య పోటీ ఉంటేనే .. పోటాపోటీగా ఉంటారని లేకపోతే ఎదురులేదనే ధీమాతో నేతలు లైట్ తీసుకుంటారన్న విశ్లేషణతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు. మొత్తం అన్ని నియోజకవర్గాలకూ అదనపు పరిశీలకుడు లేదా సమన్వయకర్త పేరుతో ఒక్కో నేతను రెడీ చేశారు. దానిపై జగన్ వరుసగా వారం రోజుల పాటు గంటల తరబడి .. సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించారని ఇక అధికారిక ప్రకటన .. దసరాకు వస్తుందని అనుకున్నారు. చివరికి దసరా వెళ్లిపోయినా జగన్ ఆ నిర్ణయాన్ని మాత్రం హోల్డ్‌లో పెట్టారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని… అభివృద్ధి పనులు.. ఇతర రాజకీయాలతో తంటాలు ఇప్పుడు వారికి పోటీగా మరొకర్ని నియోజకవర్గంలో ప్రోత్సాహిస్తే మొత్తానికే పార్టీ చిందరవందర అవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపించింది. పోటీ ఉండటం అంటే.. నేతలు పట్టు పెంచుకుంటే పర్వాలేదు కానీ హైకమాండ్ పట్టుబట్టి.. నియమిస్తే.. తామే తర్వాతి అభ్యర్థులమని వారు చెలరేగిపోయే అవకాశం ఉందని వైసీపీ పెద్దలు చివరి క్షణంలో ఆలోచించారు. చివరికి ఈ నియామకాల విషయంలో వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.
అయితే పార్టీ బలహీనంగా ఉందని.. ఐ ప్యాక్‌తో పాటు మరో రెండు స్వతంత్ర సర్వే సంస్థల నివేదికలను పరిశీలించి కనీసం 70 నుంచి 100 నియోజకవర్గాల్లో అయినా కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడేవారి మధ్యచిచ్చు పెట్టడం ఎందుకని.. తాడికొండలో పరిస్థితి చూస్తే అర్థమైపోతుందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. శ్రీదేవి ఎమ్మెల్యేగా ఓ వర్గాన్ని రెడీ చేసుకున్నారు. వారంతా డొక్కాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకూ ఈ అదనపు సమన్వయకర్తల విషయంలో వెనక్కితగ్గడమే మంచిదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.