జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో సీబీఐ స్పష్టత లేని వైఖరి ఇంకా కొనసాగుతోంది. రాతపూర్వక వాదనలు వినిపిస్తామని అదే పనిగా వాయిదాలు కోరుతున్న సీబీఐ.. ఈ సారి కూడా అదే పని చేసింది. ఈ రోజు మరోసారి విచారణకు వచ్చిన సమయంలో.. సీబీఐ మళ్లీ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు గడువు కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి సీబీఐ అసలు .. ఎలాంటి వాదనలు వినిపించదల్చుకోలేదు. కానీ పదే పదే మాట మార్చుకుంటూ వస్తోంది.
గత విచారణలో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు కోరింది. కోర్టు అంగీకరించింది. ఇప్పుడు మళ్లీ గడువు కోరింది. అసలు ఈ కేసులో అనేక వాయిదాలు సీబీఐ వల్లనే వచ్చాయి. మొదట పిటిషన్ దాఖలయినప్పుడు… మూడు సార్లు వాయిదాలు కోరి… చివరికి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మెరిట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కౌంటర్ దాఖలు చేసింది. తమకు ప్రత్యేకమైన అభిప్రాయం లేదని తెలిపింది. ఇక వాదనలు పూర్తయ్యాయి అనుకునే సమయంలో.. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపి వాయిదా అడిగింది. కోర్టు అంగీకరించింది.
మళ్లీ వాయిదాకు.. తమకు లఖిత పూర్వకవాదనలు సమర్పించే ఉద్దేశం లేదని తెలిపింది. అప్పుడు కేసు వాయిదా పడింది. మళ్లీ తర్వాత వాయిదాలో.. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని పది రోజుల గడువును సీబీఐ కోరింది. ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరింది. సీబీఐ ఇలా వాయిదాల మీద వాయిదాలను అడగడం వెనుక ఏదోఆంతర్యం ఉందని రఘురామ తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అటు రఘురామతో పాటు ఇటు జగన్ కూడా లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. సీబీఐ వల్లే విచారణ ఆలస్యం అవుతోంది.