ముద్రగడ పద్మనాభం కాపు గర్జనను ప్రకటించినప్పటినుంచి ఆయనకు బేషరతుగా తమ మద్దతు తెలియజేసి, ఆయన వెన్నంటినిలిచి, ఆయన గర్జనకూడా విజయవంతం కావడానికి తమ పార్టీ శ్రేణులను కూడా ఉత్సాహపరచిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్ష గనుక.. వైకాపా సంబరంగా మద్దతు తెలియజెప్పిందని తాటాకులు కట్టేయడానికి కూడా వీల్లేదు. అయితే కాపు వర్గంలో తమకు సమానంగా బలాన్ని కోరుకోవడం వారి లక్ష్యాల్లో ఒకటి కాదని అనడానికి కూడా వీల్లేదు. మొత్తానికి ముద్రగడ దీక్షకు వారు తొలినుంచి వెన్నంటి నిలిచారు. ముద్రగడ డిమాండ్లను అచ్చంఅలాగే ఆమోదించాలని జగన్ కూడా మద్దతిచ్చారు.
గర్జన సందర్భంగా చంద్రబాబునాయుడు తీరు మీద ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరగినప్పుడు, అలాగే.. హింసాత్మక సంఘటనల తర్వాత.. అది సర్కారీ దూకుడుగా.. ప్రభుత్వ గూండాలే హింసకు పాల్పడినట్లుగా ముద్రగడ ఆరోపణలు కురిపించినప్పుడు, ఆ తర్వాత ముద్రగడ దంపతులు, కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు చంద్రబాబు మీద, ఆయన ఆస్తులు సంపాదనల మీద విచ్చలవిడిగా చెలరేగిపోయినప్పుడు.. ప్రతి సమయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండగ చేసుకున్నారనడంలో సందేహం లేదు.
అయితే తాజాగా దీక్షను విరమించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చేసిన ప్రసంగం మీద జగన్ కోటరీ నాయకులంతా ఫైర్ అయిపోతున్నారు. దీక్ష విరమించినందుకు వారికి భిన్నాభిప్రాయం ఏమీ లేదు. అయితే ”ప్రభుత్వం హామీ ఇచ్చింది గనుక.. విరమిస్తున్నా. మాటతప్పితే ఈ సారి మన్నించను” లాంటి డైలాగులతో నిమ్మరసం తాగేసి ఉంటే వారికి కూడా సంతృప్తి ఉండేది. కానీ ముద్రగడ ప్రసంగం సాంతం చంద్రబాబు ఎదుట సాగిలపడిపోయినట్లుగా ఉన్నదని వైకాపా నాయకులు గుర్రుగా ఉన్నారుట. ముద్రగడ ప్రసంగంలోని కొన్ని వాక్యాలు వారికి మరీ మంట పుట్టిస్తున్నాయి. ”వయసు మీరిపోతోంది. ఇదే చివరి దీక్ష. ఇక దీక్షలు కూడా చేయలేను” అనడంతోటే సీరియస్నెస్ మొత్తం మంటగలిసిపోయిందని వారంటున్నారు. అలాగే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పడం కూడా వారికి రుచించలేదు. చంద్రబాబు ఆస్తులు, సంపాదన మీద ముద్రగడ చేసిన ఆరోపణలు ఏదో ఆవేశంలో చేసిన మాటలు గా స్వయంగా ఆయనే తేల్చేశారని వారు అంటున్నారు. ”మిమ్మల్ని గానీ, మీ పార్టీని గానీ నిందించాలన్నది నా ఉద్దేశం కాదు. ఆవేశంలో ఏదైనా మాట తూలి ఉంటే క్షమించండి” అంటూ ముద్రగడ చెప్పడంపై మండిపడుతున్నారు. అన్నిటినీ మించి.. చంద్రబాబు కాళ్లు కడుగుతా అనడం వైకాపా నాయకుల ఆగ్రహానికి పరాకాష్టగా ఉంది. కాపులను బీసీల్లో చేర్చడం మా హక్కు, దాన్ని సాధించుకుంటాం అంటూ మాట్లాడవలసిన నాయకుడు, ‘‘కాపులను బీసీల్లో చేరిస్తే మీ ఇంటికి వచ్చి మీ కాళ్లు కడుగుతా” అంటూ మాట్లాడడం సరెండర్ అయిపోయినట్లుగా ఉన్నదని జగన్ కోటరీ భావిస్తున్నారుట.
ముద్రగడను నమ్ముకుని.. కాపుల తరఫున చంద్రబాబునాయుడు మీద యుద్ధం సాగించవచ్చునని చేసిన ప్రయత్నం మట్టి గుర్రాన్ని పట్టుకుని ఏటిని ఈదినట్లుగా నీరుగారిపోయిందని ఉసూరుమంటున్నారుట.