రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ఆయన తాను మాత్రం వదిలి పెట్టబోను అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మద్దతు ఎన్డీఏ కూటమికే అని సంకేతాలు పంపుతున్నారు.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశాన్ని ఇందుకు ఉపయోగించుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాకపోతే తాను మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చారు. జగన్ కు ఎన్ని సీట్లు వస్తాయన్న సంగతి పక్కన పెడితే టీడీపీ కూటమిలో ఉంటే.. మద్దతు ఇస్తానని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాస్తయిన సిగ్గుపడాలి. కానీ ఆయన అలాంటిదేమీ పెట్టుకోలేదు. నిర్మోహమాటంగా ఎన్డీఏకు తన మద్దతు ఉంటుందంటున్నారు. అంబటి రాంబాబుతోనూ ఓ టీవీ చానల్ లో అదే చెప్పించారు.
కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా ఉండక తప్పని పరిస్థితి జగన్ ది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. తనపై వారి చల్లని చూపు లేకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని ఆయన భయం. జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న తప్పులు కాదు. ఆధారాల్లేనివి కాదు. బహిరంగంగా.. ఇట్టే దొరికిపోయే ఘోరాలు చేశారు. అందుకే ఆయనకు బీజేపీ కాళ్లు పట్టుకుని వదిలే అవకాశం లేకుండా పోయింది.