మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేనంత ఉత్సాహం తెప్పిస్తోంది. సెమీ ఫైనల్స్ అని స్వయంగా వైఎస్ఆర్సీపీ నేతలే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుని …ఇక ఫైనల్స్‌కు రెడీ అవుతున్నామని అంటున్నారు. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతటి ఫలితాలు వస్తాయని టీడీపీ కూడా అనుకోలేదు. అక్రమాలతో అయినా వైసీపీ గెలుస్తుందనుకున్నారు. కానీ ఊహించని ఫలితాలొచ్చాయి.
గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ డీలాపడింది. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో పట్టు మని పదిహేను మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగతా వారంతా సైలెంట్ అయారు. నలుగురు వైసీపీలో చేరారు. టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. స్వయంగా టీడీపీ ఆఫీసు మీద కూడా దాడి చేశారు. క్యాడర్ లో భయం.. నేతల్లో నిర్లిప్తత పెరిగిపోయిన సమయంలో… పోరాడితే పోయేదేముందనే ధైర్యాన్ని … వేధింపుల ద్వారా జగన్ కల్పించారు. అంతే కాదు పాలన అంటే సొంత ఖర్చులన్నట్లుగా చేయడం కూడా కలిసి వచ్చింది.
ప్రభుత్వం పూర్తిగా నగదు బదిలీ పథకాలపైనే దృష్టి పెట్టింది. అభివృద్ధి అనే మాటే లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టిన పోలవరం వంటిప్రాజెక్టులు ఆగిపోయాయి. అమరావతి నిర్మాణం ఆపేసి మూడు రాజధానులు అంటున్నారుకానీ.. ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందన్న అభిప్రాయం- ప్రజల్లో ఏర్పడుతోంది. నాలుగేళ్లలో ఎలాంటిపెట్టుబడులు తీసుకు రాలేదని యువతకు ఉపాధిచూపించలేదని.. ఉద్యోగాల కేలండర్ పేురతో మోసం చేశారన్న ఆగ్రహం ఉంది. ఇవన్నీ జగన్ వైఫల్యాలే.
ప్రతిపక్షం వీటిని క్యాష్ చేసుకోగలదా అనుకున్నారు. కానీ టీడీపీ అందరి అంచనాలను తలకిందులు చేసి ప్రజలు తమ వైపు ఉన్నారని చూపించుకుంది. అందుకే టీడీపీకి వచ్చిన ఈ ధైర్యం. .. విజయం వెనుక ప్రధాన క్రెడిట్ జగన్ కే ఇవ్వాలి.