కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పొత్తు అంటూ పీకే కాంగ్రెస్‌తో కాస్త టచ్‌లో ఉన్నప్పుడు జరిగిన ప్రచారం ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. అంతే కాదు విపక్షాలు మొత్తం వైసీపీని ఎన్డీఏ ఖాతాలో వేసేశాయి. విపక్షాల లెక్కలోకి అసలు తీసుకోవడం లేదు. కనీసం సంప్రదింపులకు కూడా పిలవడం లేదు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ సమాచారం పంపుతున్నారు కానీ.. జగన్ ను మాత్రం పట్టించుకోవడం లేదు.
చివరికి జాతీయరాజకీయాల విషయంలో ఆమడ దూరం ఉండే .. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌ను కూడా ఆహ్వానించారు దీదీ. కానీ జగన్ కు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఆయనను బీజేపీ ముఖ్యమంత్రుల జాబిాతలోనే వేసినట్లుగా తేలిపోతోంది. ఈ విషయంలో వైసీపీ కూడాపెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పిలవకపోతేనే మంచిదని అనుకుంటోంది. తమపై బీజేపీ ముద్ర ఉండటం అడ్వాంటేజ్‌గా భావిస్తూండటంతో సమస్య రావడం లేదు.
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కల్పించడం వైసీపీకి అవసరం . అందుకే వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. పరిస్థితి చూస్తూంటే వైసీపీ ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీ నిలబెట్టబోయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.