ఎకరం పొలం లీజుకు ఇస్తే ఏటా రూ. 30వేల రూపాయలు ఇస్తారు. పది ఎకరాలిస్తే .. మూడు లక్షల రూపాయలిస్తారు. ఎవరో కాదు ప్రభుత్వమే. లీజు పరిమితి ముగిశాక ఎవరి భూములు వారికే.. ఇది మామూలు ఆఫర్ కాదు. ఈ ఆఫర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో రామ్ కో సిమెంట్ కొత్త ప్లాంట్ ను జగన్ ప్రారంభించారు. సందర్భం లేకపోయినా ఆయన పొలాల లీజు గురించి మాట్లాడారు. ఎకరానికి ముఫ్ఫై వేలు ఇవ్వడమే కాకుండా మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుందని చెబుతున్నారు.
ఈ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుందంటే… సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థలకు ఇస్తుంది. వారు ఆ పొలాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కర్నూలులో విండ్ పవర్ ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జగన్ పదివేల మెగావాట్లకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆయన సన్నిహితుల కంపెనీైలు అందులో ఉన్నాయి. వాటికి భూమి కొరత ఉంది. ప్రైవేటు కంపెనీలకు భూ సేకరణ భారం కాబట్టి .. ప్రభుత్వమే రంగంలోకి దిగుతోంది.
స్వాధీనం చేసుకోవడం క్లిష్టమైన విషయం కాబట్టి రైతులకు సీఎం జగన్ లీజు ఆఫర్ ఇచ్చారు. ఎకరానికి ముఫ్పై వేలు.. మూడేళ్లకు ఐదు శాతం పెంపుదల ఆఫర్ ఆకర్షణీయంగానే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే భూములు ఒక సారి ప్రభుత్వం చేతుల్లోకి అక్కడ్నుంచి విద్యుత్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రభుత్వం కౌలు ఇవ్వకపోతే చేయగలిగిందేమీ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంటేనే ఇలాంటి ఆఫర్లు వర్కవుట్ అవుతాయి. కానీ జగన్ ను నమ్మే పరిస్థితి ఉందా అనేది కీలకం.
ఇప్పటికే అక్కడి రైతులు భూములు ఇచ్చేది లేదంటున్నారు. అందుకే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని జగన్ కోరుతున్నారు. కానీ నమ్మకం లేని చోట.. సాధ్యం కాదనే ఎక్కువ మంది భావన.