ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఇప్పటికే వైసీపీ నేతలు వారోత్సవాలు చేసేశారు. ఇప్పుడు పండగొచ్చింది. మరి పుట్టిన రోజుంటే.. హ్యాపీ బర్త్‌డే చెబితే సరిపోదుగా.. కానుకలు సమర్పించుకోవాలి. అసలే ముఖ్యమంత్రి … ఆ పైన ఆయన స్టైలే వేరు… సమర్పించుకోవాలనుకున్న కొద్దీ .. సమర్పించుకోవాలి. లేకపోతే… ఎటొచ్చి.. ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ఈ భయం అంతా.. కానుకల సమర్పణలో కనిపిస్తోంది. ఆ కానుకలన్నీ బహిరంగంగానే కనిపిస్తున్నాయి. జగన్ పుట్టిన రోజు సందర్భంగా.., సాక్షికి ప్రకటనలు సమర్పించుకున్న వారందర్ని చూస్తే.. అన్నతో మామూలుగా ఉండదనే డైలాగ్‌ను గుర్తు చేసుకోవాల్సి రావొచ్చు.
చెవిరెడ్డి, బియ్యం మధుసూదనరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లు సమర్పించేసుకుని ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. వారంటే అధికార పార్టీ నేతలు కాబట్టి.. ఇచ్చారనుకోవచ్చు. కానీ మెఘా ఇంజినీరింగ్ దగ్గర్నుంచి … ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వరకూ.,.. అనేకాకనేక వ్యాపార సంస్థలు… ప్రకటనలు ఇచ్చాయి. చివరికి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన రిలయన్స్ ప్రముఖులు పరిమళ్ నత్వానీ కూడా.. డబ్బులు పెట్టి.. జన్మదినశుభాకాంక్షల ప్రకటనలు ఇచ్చారు. టీడీపీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా ఉండి.. లైసెన్సులన్నీ ప్రస్తుత సర్కార్ హోల్డ్‌లో పెట్టడంతో వైసీపీలో చేరిపోయిన శిద్ధా రాఘవరావు కూడా… ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. ఇలా అంచనాలు వేస్తూ.. పోతే.. ఓ వర్గం భారీగా ప్రకటనలు ఇచ్చింది. అమరావతిలో యూనివర్శిటీలు పెట్టిన వీఐటీ, ఎస్ఆర్ఎం కూడా కరోనా కష్టాల్లో అడ్మిషన్లు లేకపోయినా.. హాఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ఎక్కడా తమ యూనివర్శిటీలు అమరావతిలో ఉన్నాయని చెప్పుకోలేదు. విజయవాడ దగ్గర్లో అని యాడ్‌లో ఇచ్చుకుని భయభక్తుల్ని చాటుకున్నాయి.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఎవరైనా కాస్త నైతికత పాటిస్తారు. తన పదవిని చూసి..ఏదో ఆశించి.. పొగడ్తలు కురిపించేవారిని దూరం పెడుతారు. తమ సంస్థకు లాభం చేకూర్చడాన్ని అసలు ఇష్టపడరు. కానీ.. జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు. ఆయన ఇలాంటి నైతికతను అసలు పట్టించుకోరు. పత్రికలకు ఇస్తున్న ప్రకటనల్లో యాభై శాతానికిపైగా సొంత పత్రికకే ఇస్తున్నారు. ప్రజాధనాన్ని మళ్ళిస్తున్నారని విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోరు. అలాంటిది తన పుట్టిన రోజుకు ఇతరులు ప్రకటనలు ఇస్తే మాత్రం ఎందుకు వద్దంటారు.
జగన్ పుట్టిన రోజు సందర్బంగా.. వారోత్సవాల్లో సాక్షికి కనీసం రూ. యాభై కోట్ల వరకూ శుభాకాంక్షల ప్రకటనల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇలా ఇచ్చిన వారందరూ.. ప్రభుత్వం తరపున కాంట్రాక్టులు చేసినవారో… లేకపోతే.. పార్టీలు మారినవారో.. వేధింపులు ఎదుర్కొన్న పారిశ్రామిక, వ్యాపారవేత్తలో కావడమే.. విమర్శలకు తావిచ్చేలా ఉంది.