నవంబర్ 2 నుంచి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ ఈ యాత్ర సాగుతుంది. పాదయాత్రపై వైకాపా చాలా ఆశలు పెట్టుకుంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తరువాత టీడీపీపై ప్రజా వ్యతిరేకత మరీ తీవ్రంగా లేదనేది స్పష్టమైంది. దీంతో వైకాపా వర్గాలు కాస్త డీలా పడ్డాయి. అయితే, ఇప్పుడు ‘అన్న వస్తున్నాడు’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం వైకాపా సంధిస్తున్న బ్రహ్మాస్త్రం ఇదే అని కూడా అనొచ్చు. అందుకే, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు జగన్. అన్ని రకాల నమ్మకాలూ విశ్వాసాలను కూడా ఇప్పుడు నమ్ముతున్నారు.
మంగళవారం నాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్.. చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లడం విశేషం. చిన జీయరుతో దాదాపు ఓ అర్ధ గంటపాటు జగన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించీ, త్వరలో తాను చేపట్టబోతున్న పాదయాత్ర గురించి స్వామీజీకి జగన్ వివరించినట్టు సమాచారం. పార్టీలో ఎదురౌతున్న కొన్ని ఇబ్బందుల గురించి కూడా చినజీయరుకు జగన్ చెప్పారంటూ కొన్ని కథనాలు వచ్చాయి! విశేషం ఏంటంటే.. జగన్ ను ఆశ్రమంలోకి ఆహ్వానించిన దగ్గర నుంచీ, తిరిగి వెళ్తున్నప్పుడు జగన్ కారులో ఎక్కే వరకూ చినజీయరు కూడా పక్కనే ఉండటం. ఆశ్రమం నుంచి బయలుదేరుతున్న సమయంలో చినజీయరుకు పాదాభివందనం చేసి, ఆయన ఆశీస్సులు జగన్ తీసుకున్నారు.
మొత్తానికి, జగన్ లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది! పాదయాత్ర విషయంలో కొంతమంది జ్యోతిష్కుల సలహాలు తీసుకున్నారని ఆ మధ్య అన్నారు. నిజానికి, ఈ నవంబర్ 2వ తేదీని కూడా పండితులు నిర్ణయించిన ముహూర్తం అనే చెబుతున్నారు! ఇప్పుడు చినజీయరు ఆశీర్వాదం కోరారు. ఇలా చేయడం సరైన విధానం కాదని ఎవ్వరూ విమర్శించరు. కానీ, ఇలాంటి వ్యవహారాలు వ్యక్తిగతమై ఉండాలి. బహిరంగ ప్రదర్శనలు అనవసరం కదా! ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక్క లక్ష్యంతోనే జగన్ పాదయాత్ర చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే టీడీపీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాదాభివందనాలను కూడా అదే కోణం నుంచి విమర్శించే అవకాశాలుంటాయి కదా! పార్టీలో సమస్యల గురించి స్వామీజీల దగ్గర ప్రస్థావించారనే కథనాలు రావడం వారి ఇమేజ్ కి ఇబ్బంది కలిగించే అంశమే అవుతుంది. అంటే, పార్టీలో జగన్ సొంత ఆలోచనలు అమలు కావడం లేదా అనే కోణం, జగన్ చక్కబెట్టలేని ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ కూడా మొదలయ్యేందుకు అవకాశం ఎందుకివ్వడం..? చినజీయరు దగ్గర నుంచి వస్తున్నప్పుడే మీడియాతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడేస్తే సరిపోయేది కదా!