అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి మీద చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓ పుస్తకం ప్రచురించారు కాబట్టి.. ఇప్పుడు తాము కూడా చంద్రబాబునాయుడు అవినీతి మీద ఎంచక్కా ఓ పుస్తకం ప్రచురించాలని వైఎస్ జగన్ అనుకున్నారేమో తెలియదు. మొత్తానికి ఎంపరర్ ఆఫ్ కర్షన్ పేరుతో ఓ పుస్తకం వైకాపా ప్రచురించింది. తెలుగుదేశం అప్పట్లో రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం వేస్తే వీరు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని టైటిల్ పెట్టడాన్ని బట్టే.. ఏదో కసిగా వేసినట్టున్నదే తప్ప.. నిర్దిష్టంగా చేసిన ప్రయత్నం కాదని ఎవరికైనా అర్థమవుతుంది.
అయితే ఈ పుస్తకాన్ని జగన్ కూడా పెద్దగా ప్రచారంలోకి తీసుకురాలేదు. అందులోని అంశాలపై ఆయనకు కూడా పెద్దగా ఇష్టం ఉన్నట్లు లేదు. ఏదో ఢిల్లీలో కేంద్రం మంత్రుల్ని కలవడానికి, చంద్రబాబునాయుడు మీద కేంద్ర మంత్రుల ఎదుట బురద చల్లడానికి ఆ పుస్తకం కాపీలను వారికి దఖలు పరిచారే తప్ప.. ఆ పుస్తకాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా జరగలేదు.
కానీ అలా వెనక్కు తగ్గడానికి కారణం ఇప్పుడు బోధపడుతోంది. జగన్ సంధించిన తూటా వెనక్కు పేలిందా అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబునాయుడు అవినీతి అని పేర్కొంటూ జగన్ నివేదించిన అనేక అంశాల విషయంలో, అనంతర కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డగోలుగా మరింత దారుణమైన నిర్ణయాలు తీసుకున్న వైనం తెలిసి వస్తున్నది. ప్రచురించిన అంశాలు కాకుండా ప్రజలు ఏ కొంచెం అదనంగా ఆలోచించినా.. తమ వైఫల్యాలే వారికి తెలిసిపోతాయని జగన్‌కు అర్థమైనట్లుగా కనిపిస్తోంది.
తాజాగా ముద్దుకృష్ణమ నాయుడు ఈ పుస్తకంలో ఉన్న అంశాల విషయంలో అసలు అవినీతి బురద వైఎస్సార్‌కే ఎలా అంటుకుంటుందో వివరించి చెప్పారు. ఎమార్ ప్రాపర్టీస్‌కు చేసిన కేటాయింపుల్లో 24 శాతం ప్రభుత్వానికి చెందేలా చంద్రబాబు నిబంధనలు పెడితే, వైఎస్సార్తాను స్వయంగా దానిని 11 శాతానికి తగ్గించేయడం ఇందులో హైలైట్. ఈ కుంభకోణంతో ముడిపడిన కోనేరు ప్రసాద్ వైకాపా తరఫున విజయవాడ ఎంపీగా కూడా పోటీచేయడం విశేషం. అలాగే రాంకీ అయోధ్య రామిరెడ్డి వ్యవహారం కూడా బ్యాక్‌ఫైర్ అయినదే. ఆయనకు విశాఖలో కేటాయించిన ఫార్మా సిటీలో 40 శాతం పచ్చదనానికి కేటాయించాలనే నిబంధన ఉండగా, దానిని 15 శాతానికి తగ్గించిన నిర్ణయం వైఎస్సార్ తీసుకున్నదే. ఆ కుంభకోణం సూత్రధారి రాంకీ అయోధ్య రామిరెడ్డి కూడా వైకాపా తరఫున నరసరావుపేట ఎంపీగా పోటీచేశారు. తరచిచూస్తే కేటాయింపుల్లో కాకుండా ఈ ”తగ్గింపుల్లోనే” పెద్ద అవినీతి ఉన్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటివి ఆ పుస్తకంలో మరిన్ని వివరాలు ఉన్నాయి.
జగన్మోహనరెడ్డి అండ్ కో అత్యుత్సాహానికి పోయి చంద్రబాబునాయుడు అవినీతి మీద పుస్తకం వేయడం ద్వారా.. తమ వైఎస్సార్ అవినీతిని తామే బయటపెట్టుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.