ప్రజా నాయకుడు ప్రజల్లో ఉండాలి. ప్రజల గుండెల్లో ఉండాలి. ప్రజల మనసును గమనించి మసలుకోవాలి. సొంత ఇగోను బీరువాలో దాచిపెట్టాలి. సరిగ్గా దీనికి రివర్స్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళ్లకూడదనే సలహా ఆయనకు ఎవరిచ్చారో గానీ, జనానికి జగన్ ను దూరం చేసే ప్రయత్నమేమో అని పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రం దృష్టి అంతా రాజధాని మీదే ఉండగా, జగన్ హైదరాబాదులో కూర్చుంటారు. అసలు, జగన్ దీక్షను జనం పట్టించుకోలేదని ఇప్పటికే స్పష్టమైంది. ఇక ముందైనా జనం మూడ్ ను పసిగట్టి అడుగులు వేయాలనే సలహా ఎవరూ ఇవ్వలేదేమో.
భూ సమీకరణలో బలవంతంగా రైతుల పొలాలు లాక్కున్నారని జగన్ ఆరోపణ. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందంటోంది సర్కార్. ప్రభుత్వ పరిహారానికి సంతోషంగా ఒప్పుకున్నామని రైతులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఆరోపణ నిజం కాదని మంత్రులు డంకా బజాయించి చెప్తున్నారు. శంకుస్థాపనకు ప్రజా ధనం దుబారా చేస్తున్నారు కాబట్టి రానంటూ బహిరంగ లేఖలో జగన్ మరో అంశం పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దుబారా చేస్తే కచ్చితంగా నిలదీయాల్సిందే. అయితే, రాజధాని శంకుస్థాపనను ప్రజా కార్యక్రమంగా మార్చారు. ఊరూరా, ఇంటింటా దీని గురించే చర్చించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలివిగా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇదొక సెంటిమెంటుకు సంబంధించిన అంశంగా మారింది. పైగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా విజయ దశమినాడు శంకు స్థాపన చేయించడం మరో విశేషం. ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నా, నిధుల దుబారా జరిగినా, ఇంకేం జరిగినా, ముందు ఈ శుభకార్యం జరగనివ్వాలి. దీనికి హాజరు కావాలని జగన్ నిర్ణయించాల్సింది.
జన నేత జనానికి దూరంగా ఉండటం సరికాదు. కాలం మారింది. ఒకప్పటి ముతక రాజకీయాలు ఇప్పుడు చెల్లవు. హైటెక్ సీఎంగా ఉన్న ఇమేజే ఇప్పటికీ చంద్రబాబుకు శ్రీరామ రక్షగా ఉందని గుర్తించాలి. ఎన్ని లోపాలున్నా రాష్ట్రానికి చెందిన శుభకార్యానికి బాధ్యతగా వచ్చానని జగన్ ప్రకటించి ఉంటే మరోలా ఉండేది. రాజకీయ వైరుధ్యాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకం కావద్దనే సందేశాన్ని అమరావతి వేదిక నుంచి జగన్ తన మాటల ద్వారా చేతల ద్వారా వినిపించి ఉంటే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండేది. అభ్యుదయ భావాలుగల యువనేతగా యువ ఓటర్లు జగన్ ను చూసేవారు.
శంకు స్థాపన పూర్తయిన తర్వాత, నిధుల గురించి ఇంకో దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. జవాబు రాబట్టవచచు. ఇక ముందు మాత్రం దుబారా లేకుండా ఎప్పటికప్పుడు చెక్ పెట్టవచ్చు ఏమైనా చేయవచ్చు. కానీ రాజధాని శంకుస్థాపనకే రాననడం బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అనాల్సిన మాట కాదు. కేవలం ఇగో వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రేపు మంత్రులు విమర్శలు మొదలుపెడితే కాదని వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల కోసమైనా తన నిర్ణయాన్ని విడమరచి చెప్పాల్సి ఉంటుంది. దాన్ని జనం నమ్ముతారో లేదో తెలియదు. నమ్మక పోతే జనానికి మరింత దూరం కావడం ఖాయం.