జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్క రోజు.. విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి ర్యాలీ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు… మొత్తం ఏపీ కేబినెట్ అంతా స్పందించింది. ముఖ్యంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఇచ్చిన పిలుపు.. ప్రభుత్వానికి సూటిగా తగిలింది. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ఆదిమూలపు సురేష్ వరకూ ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా.. రాజకీయంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను కించ పరిచేందుకే.. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ కల్యాణ్ రైతు పోరాటాన్ని ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు చెబితే చేస్తున్నాడన్నట్లుగా చెప్పుకొచ్చారు. వారికి రైతులపై ప్రేమ లేదన్నారు. ఆయన మంత్రులు మాత్రం.. వైసీపీ బ్రాండ్‌కు ఏ మాత్రం తగ్గకుండా.. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. మంత్రి పేర్ని నాని .. పవన్ ను చిడతల నాయుడు అని అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. చిడతలు కొట్టడానికి కూడా డబ్బులు సంపాదిస్తాడని మండిపడ్డారు.
పేర్ని నాని ఇలా అనడానికి కారణం.. మచిలీపట్నంలో పవన్ కల్యాణ్… చిడతలు కొట్టడం ఆపి పని చేయాలని.. నానికి సూచించారు. అందుకే.. తాను చిడతలు కొట్టడం లేదని.,. పవనే కొడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే.. తాను చేసేదానికి స్వామిభక్తి అనే పేరు పెట్టుకున్నారు. తనది స్వామి భక్తి అని.. తను చనిపోయేటప్పుడు కూడా వైఎస్ జపం చేస్తానని చెప్పుకొచ్చారు. పేర్ని నాని మాత్రమే కాదు కొడాలి నాని కూడా.. ఘాటుగా స్పందించారు. ప్యాకేజీలు తీసుకుని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్ల్ అని నిందించారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో.. రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్ పర్యటనలని… అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారో చెప్పాలని పీఆర్పీ నుంచి రాజకీయ జీవితం పొందిన అవంతి ప్రశ్నించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పై ఎలా స్పందించారని.. కోవిడ్ సమయంలో పవన్ ఎక్కడికెళ్లారో చెప్పాలని మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయిన పవన్ కల్యాణ్… రాజకీయాలకు ఏం పనికి వస్తారని.. మంత్రి ఆదిమూలపు సురేష్ తేలిగ్గా తీసుకున్నారు.
రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదని .. రాజకీయాల్లో ఉండాలంటే పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. అందరూ.. అసెంబ్లీ ముట్టడికి పవన్ ఇస్తామన్న పిలుపును ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో.. మొత్తం కేబినెట్ ఆయనపై ఎదురుదాడి చేయడానికి రెడీ కావడంతోనే తేలిపోయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ జనంలోకి వస్తే వచ్చే స్పందన ఎలా ఉంటుందో కళ్ల ముందు కనిపించంది కాబట్టే… ప్రభుత్వం… మూకుమ్మడి ఎటాక్ చేసి.. పవన్ కల్యాణ్ ను.. కంట్రోల్ చేయాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ వేడిని తగ్గించకుండా… మరింత ఘాటుగా ప్రభుత్వంపై పోరాడాలన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.