మొత్తం 25 మందితో కొలువుదీరిన ఏపీలో జగన్ సర్కారు.. ఈ వంద రోజుల పాలనా కాలాన్ని భేరీజు వేసే పనిలో పడింది. మంత్రులపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టిన సీఎం జగన్.. వారి పనితీరుపై నిఘావర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాను పనిగట్టుకుని దేశంలోనే తొలిసారిగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేశారు. వీరికి ఆరోజు చెప్పిన దాని ప్రకారం రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. ఈ రెండున్నరేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుని పాలనకు సంబంధించి మెరుపు మెరిపించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
అయితే, ఇప్పుడు జగన్ అందిన నివేదికల ప్రకారం దాదాపు ఆరు నుంచి ఏడుగురు మంత్రులు కేవలం పదవుల్లో ఉన్నారే తప్ప పనివిషయంలో పెద్దగా దూకుడు ప్రదర్శించింది కానీ జగన్ ఆశల మేరకు నడుచుకుంటున్నది కానీ లేదని స్పష్టంగా తెలిసిపోయింది. వీరిలో మైనార్టీ మంత్రి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎస్టీ వర్గానికి చెందిన గిరిజన మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, రోడ్లు, భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్, సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, ఎక్సైజ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మహిళా శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, బీసీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణలపై పలు నివేదికలు వచ్చాయి.
వీరంతా కూడా పనిలేకుండా ఉన్నారనేది సారాంశం. అదేసమయంలో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కూడా వీరుఎక్కడా కౌంటర్లు కూడా ఇవ్వకపోవడం, ప్రజలకు చేరువ కాకపోవడం వంటివి కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇలాంటి వారి స్థానంలో ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్లకు ఈ పదవులు ఇచ్చి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే నియమించిన మంత్రులను రెండున్నరేళ్ల వరకు మార్చేదిలేదనే సంకేతాలు జగన్ పూర్వమే ఇచ్చి ఉండడంతో మనం ఎలా ఉన్నా.. రెండున్నరేళ్లు పదవి ఖాయమని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇలాంటి వారి విషయంలో జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.