ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం జగన్ తన టీమ్ లో మార్పుచేర్పులు చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రో వైసీపీ మీడియా ప్రచారం ప్రారంభించింది. తాము చేయాలనుకున్న పనులు.. చక్కబెట్టాలనుకుంటున్న వ్యవహారాలకు ఆ మీడియాను వైసీపీ పెద్దలు వాడుకోవడం కామనే. ఆ ప్రకారం ఇప్పుడు మంత్రి వర్గ మార్పు చేర్పులపై మళ్లీ చర్చ ప్రారంభించారు. ఇది నిజంగానే మార్పు చేర్పులకు కారణం అవుతుందా లేదా ఇంకేదైనానా అన్నది వారికే తెలుసు. ఆరు నెలల కిందటే జరిగిన ఓ కేబినెట్ సమావేశంలో కూడా జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదని హెచ్చరించారు.
ఓ సందర్భంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత మంది మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు మంత్రుల్ని తప్పిస్తానని అప్పట్లోనే చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే మంత్రులు తర్వాత ఎగ్రెసివ్ గా మారడంతో మళ్లీ అలాంటి వార్తలు రాలేదు. మళ్లీ ఇప్పుడే అలాంటి ప్రచారం తెరపైకి వచ్చింది. కొత్తగా తీసుకుంటున్న ఎమ్మెల్సీల్లో కొంత మందికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు.
మర్రి రాజశేఖర్ అనే నాయకుడిని అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదు కానీ మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మంగళగిరిలో లోకేష్ పై గెలిచిన ఆర్కేకు పదవి ఇస్తామన్నారు . ఇవ్వలేదు. జగన్ చెప్పాడంటే చేస్తాడనే ప్రచారం కోసం అయినా వారికి పదవులు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అంతా అయిపోయే.. చివరిలో ఇచ్చే పదవులు అయినా… సరే.. ఏదో ఇచ్చామంటే ఇచ్చామనిపించుకోవడానికి బాగానే ఉంటాయనుకుంటున్నారు.
అదే సమయంలో మంత్రి పదవుల నుంచి తీసేసిన పేర్ని నాని, కొడాలి నానినే పార్టీ కోసం పని చేస్తున్నారు . ఇతర మంత్రి పదవులు తీసుకున్న వారు సైలెంట్ అయిపోయారు. వారికీ కూడా మళ్లీ పదవులివ్వాలన్న డిమాండ్ వైసీపీలో ఉంది. వీటిపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమోనని వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు