ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో ఎవరికి స్థానాలు దక్కుతాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 151 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి గెలిచారు. వీరిలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనవారు ఉన్నారు, వైకాపా పార్టీ పెట్టక ముందు నుంచీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన అనుయాయులూ ఉన్నారు, పార్టీ పెట్టిన దగ్గర్నుంచీ నమ్ముకుని ఉన్నవారూ ఉన్నారు, గత ప్రభుత్వ హయాంలలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు కూడా ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి పదవులు ఇస్తానంటూ జగన్ నుంచి హామీలు పొందినవారు కొందరున్నారు. కులాల వారీగా చూసుకుంటే దాదాపు 50 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన దాదాపు 26 మంది వరకూ ఉండాల్సిన మంత్రి వర్గ కూర్పుపై ఆశలు పెట్టుకునేవారి జాబితా చాలా పెద్దదే అవుతుంది. అయితే, కులాలు ప్రాంతాలను దృష్టిపెట్టుకుంటూ…. అన్ని సమీకరణల మధ్యా సమతౌల్యం సాధిస్తూ మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం.
పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి 7 మంత్రి పదవులు ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి 2 బెర్తులు దక్కుతాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మరో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురు లేదా ఐదుగురికి మంత్రి వర్గంలో స్థానం దక్కనుందని అంటున్నారు. ఇతర బీసీ కులాలకు కూడా దాదాపు అదే లెక్కల్లో గరిష్టంగా 5 మంత్రి పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. మహిళల కోటాలో ఎమ్మెల్యే రోజాకి పదవి గ్యారంటీ అని మొదట్నుంచీ వినిపిస్తోంది.
మైనారిటీ కోటాలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాకి కేబినెట్ లో బెర్తు కన్ఫర్మ్ అంటున్నారు. కడప జిల్లాకు చెందిన అంబర్ బాషా పేరు కూడా ఇదే జాబితాలో వినిపిస్తోంది. ఇదే లెక్కల్లో జిల్లాలవారీగా కూడా పదవుల సమతౌల్యం ఉండేట్టు జాగ్రత్తపడుతున్నట్టుగా కనిపిస్తోంది. కులాలవారీగా, మతాలవారీగా, ప్రాంతాలవారీగా, మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా జగన్ కేబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తోంది.