ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి రెండేళ్లు దాటిపోయింది. ఆయన ఇప్పటికీ పథకాలకు ప్రారంభిస్తూ.. మోడిఫై చేస్తూ.. మళ్లీ వాటిని ప్రారంభించడానికి ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. ఆయన వైఎస్ఆర్ బీమా పేరుతో పథకాన్ని రీలాంచ్ చేస్తున్నారు. ఈ పథకం ఇక ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా.. సహజ మరణం పొందిన వారికి.. ప్రమాదవశాత్తూ మరణం పొందినవారికీ… ప్రభుత్వమే నేరుగా నిధులు చెల్లిస్తుది. ఈ రెండేళ్ల నుంచి చనిపోయిన వారి గురించి ప్రభుత్వం పట్టించుకోదు.
టీడీపీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. ఇంటి యజమాని చనిపోతే దిక్కుతోచని స్థితిలో పడే ప్రమాదం నుంచి తప్పించడానికి చంద్రబాబు ఈ బీమా ఆలోచన చేశారు. ప్రమాదం అయినా.. సహజ మరణం అయినా.. బీమా సొమ్ము ఇంటికి రావడం.. అనేది అనేక కుటుంబాల్ని ఆదుకుంది. చనిపోయినట్లు సమాచారం రాగానే… అంత్యక్రియల ఖర్చులకు రూ. 5వేలు తెచ్చి ఇచ్చేవాళ్లు. పెద్ద ఖర్మఅయ్యే లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మిగతా సొమ్ము అకౌంట్లో వేసేవాళ్లు. ఈ పధకం కింద ఏపీలోని 2.46 కోట్ల మంది ఇన్సూరెన్స్ కవరేజ్లోకి వచ్చారు. పథకం ప్రారంభించిన రెండేళ్లలోనే రెండు లక్షల మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారము రూ. మూడు వేల కోట్ల వరకూ పంపిణీ చేశారు.
జగన్ సీఎం అయిన తర్వాత పథకం పేరు మార్చారు. సరే పేరు మార్చినా… ఇన్సూరెన్స్ ప్రీమియం సరిగ్గా కట్టి ఉంటే… ప్రజలకు సాయం అందేది. ఈ కరోనా కాలంలో… కొన్ని వేల మరణాలు చోటుచేసుకున్నాయి. వారందరికీ పరిహారం దక్కేది. ఓ వైపు ప్రజలను బీమా కింద నమోదు చేయించే పనే సక్రంగా చేయలేదు. నలభై..యాభై లక్షల మందికికూడా బీమాకవరేజీ రాలేదు.గతంలో టీడీపీ హయాంలో జనాభాలో అరవైశాతం మందికి బీమా కవరేజీ ఉండేది. ఇప్పుడది పూర్తిగా తగ్గిపోయింది. ప్రీమియం కట్టకపోగా… ప్రచారం మాత్రం ప్రభుత్వం భారీగా చేసుకుంటోంది.
బీమాతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే సాయం చేయడం అనేది.. అసాధ్యమైన విషయం. పేరుకు మాత్రం పథకం ఉంటుంది. కానీ సాయం ఫైల్ మాత్రం ముందుకు పడదు. ప్రభుత్వం వద్ద నిధులు ఉండవు. నిధుల మంజూరుకు అధికారులు పెట్టే తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఉన్న ఓ బీమా భరోసానిఈ ప్రభుత్వం ప్రచారదీమాగా మార్చుకుని.. మొత్తానికి నిర్వీర్యం చేసిందని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.