ఇరుకు రోడ్డుల్లో ఏర్పాటు చేస్తున్న జగన్ సభలు.. మరో ప్రాణం తీశాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జగన్ సభ జరుగుతూండగా విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. జగన్ ప్రచారం కోసం చేసిన ఏర్పాట్లలో భాగంగా.. తెచ్చిన జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తిని సోమిరెడ్డిగా గుర్తించారు. ఆయన ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తున్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కృష్ణమ్మ అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారికి వైద్యం అందించేందుకు.. కూడా వైసీపీ నేతలు పెద్దగా చొరవ చూపలేదని స్థానికులు మండి పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారసభల్లో ప్రాణనష్టం జరగడం ఇది మూడో సారి. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మొదట్లోనే.. అనతంపురం జిల్లా రాయదుర్గంలో… గోడ కూలి… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ సంఘటనా స్థలంలో ఒకరు.. ఆస్పత్రిలో ఇద్దరు చనిపోయారు. తాజాగా పిడుగురాళ్లలో మరొకరు చనిపోయారు. ఏ ఘటనలోనూ… బాధితుల వైద్యానికి సాయం అందించేందుకు వైసీపీ నేతలు ముందుకు రాలేదు.
మండపేటలో చనిపోయిన వారిని ఆదుకోలేదు. భారీగా జనాలు వస్తున్నారని చూపించేందుకు జగన్మోహన్ రెడ్డి.. ఇరుకు సందుల్లో గల్లీల్లోసభలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చిన్న సందుల్లో సభలు పెట్టి వారిని పక్కనున్న మిద్దెల మీదకు, కరెంట్ స్తంభాల మీదకు, చెట్ల మీదకు ఎక్కేలా ప్రొత్సహించడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా.. తీవ్ర విమర్శలు వస్తున్నా.. వైసీపీ నేతలు మాత్రం… పట్టించుకోకుండా … తమ మానాన తాము ప్రచారంచేసుకుంటున్నారు.