వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చాలా రోజుల తరువాత ఇవ్వాళ్ళ తెలంగాణా జిల్లాలో అడుగుపెట్టారు. వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ఆయన ఈరోజు జిల్లాలో అడుగుపెట్టారు. ఈరోజు సాయంత్రం తొర్రూరులో ఆయన నిర్వహించిన సభకు తెలంగాణా ప్రజల నుండి మంచి స్పందనే వచ్చింది. గత ఏడాదిన్నర కాలంలో ఏనాడూ తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పని జగన్మోహన్ రెడ్డి మొట్ట మొదటిసారిగా ఈరోజు తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముచ్చటపడ్డారు కనుకనే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చేయని అన్నారు. ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిని కాదని, వరంగల్ లోక్ సభ సభ్యుడు కడియం శ్రీహరిని రాజీనామా చేయించి తన మంత్రివర్గంలో తీసుకొని ప్రజల నెత్తిన బలవంతంగా ఈ ఎన్నికలు రుద్దారని జగన్ విమర్శించారు.
కేసీఆర్ కేవలం మాయ మాటలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప, వారి సంక్షేమం కోసం ఈ 16నెలల పాలనలో ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. పేదలకు ఇల్లు, భూములు, స్కాలర్ షిప్పులు, రుణాల మాఫీ ఇలాగ ప్రతీ ఒక్క హామీని తప్పారని, అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలంగాణాలో కేసీఆర్ ఇద్దరూ మాయమాటలు చెప్పే వాళ్ళే దొరకడం తెలుగు ప్రజల దురదృష్టం అని విమర్శించారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వంటి ముఖ్యమంత్రిని మీరెన్నడయిన చూసారా? అని ప్రజలను ప్రశ్నించారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే వైకాపా అధికారంలోకి రావలసిందే దానికి ఈ ఎన్నికలతోనే నాంది పలకాలి, అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.