టీడీపీ మేనిఫెస్టోను టీడీపీ నేతలే ప్రచారం చేసుకుంటే పెద్ద మ్యాటర్ కాదు.. కానీ వైసీపీ అధినేతే ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరు. సీఎం జగన్ ఆ బాధ్యతను చాలా పక్కాగా నిర్వర్తిస్తున్నారు. తాజాగా వాలంటీర్లకు వందనం సభలో కూడా జగన్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం చేశారు. తాను అమలు చేస్తున్న 8 పథకాలకు చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు.
తాను ఇస్తున్న స్కీమ్లతో పాటు చంద్రబాబు చెబుతున్న 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలని లెక్క చెప్పారు. మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా అని ఎదుట కూర్చున్న వారిని అడుగుతున్నారు. ఈ ప్రసంగం విన్న ఎవరికైనా ప్రజా సంపదను అడ్డగోలుగా ఖర్చు పెట్టుకుంటూ లక్షల కోట్లు అప్పులు చేసి అందలో అరకొరగా పంచుతున్న వైనం అందరికీ గుర్తుకు వస్తుంది. ఏడాదికి లక్ష కోట్లకుపైగానే అప్పులు చేస్తున్నారు. కానీ పంచుతున్నది తక్కువే. ఈ మాత్రం చంద్రబాబు చేయలేరా ?. చంద్రబాబు పని తనం గురించి ప్రజలకు తెలుసు. ఆయన సంపద సృష్టిస్తారు. ఆయన సృష్టించిన సంపదనే జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నారని కూడా జనానికి తెలుసు. మరి చంద్రబాబు ఆ మాత్రం చేయలేరని ఎందుకు అనుకుంటారు ? చంద్రబాబు ఇస్తున్న హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.
బాబు సూపర్ సిక్స్ పేరుతో వైరల్ అవుతున్నాయి. అందుకే జగన్ రెడ్డి ఆ హామీలను నమ్మవద్దని బతిమాలుకుంటున్నరారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు. ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి. ప్రజలు మోసపోకుండా వాలంటీర్లే అవగాహన కల్పించాలని వాలంటీర్లకు వందనం సభలో వేడుకున్నారు.