వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న పరకాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలలో కేవలం వైకాపాకు తప్ప మరే పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పారు. అందుకు ఆయన చెప్పిన కారణాలు చాలా చిత్రంగా ఉన్నాయి.
“ఈ 16 నెలల తెరాస పరిపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలుచేయలేదు. ఆయన రైతుల ఘోడు పట్టించుకోలేదు. నిత్యావసర ధరలు మండిపోతున్నా పట్టించుకోలేదు. కొత్తగా ఒక్క 108 అంబులెన్స్ కూడా కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న వాటికి కనీసం కొత్త టైర్లు వేయించలేదు. విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంట్ చేయలేదు. దళితులకు భూములు ఇవ్వలేదు. తెరాస ప్రభుత్వం అన్ని విధాల విఫలమయింది. కనుక తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదు. అది గెలిచినా ఓడినా తేడా రాదు. కానీ పొరపాటున గెలిస్తే ప్రజలకు తమ పరిపాలనను నచ్చడం వలననే గెలిపించారని చెప్పుకొనే అవకాశం ఉంది. కనుక తెరాసను తప్పకుండా ఈ ఎన్నికలలో ఓడించాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
“తెదేపాకు ఎందుకు ఓటు వేయకూడదంటే, అదొక వెన్నుపోటు పార్టీ. అబద్దాల పునాదులపై తెదేపా ప్రభుత్వం నడుస్తోంది. విభజన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదు. కనుక వాటికి ఓటు అడిగే హక్కు లేదు,” అని జగన్ అన్నారు.
“ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేయకూడదు. ఎందుకంటే ఆ పార్టీలో అవసరం ఉన్నప్పుడు మనుషులను వాడుకొంటారు. తీరేక వదిలేస్తారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తే చివరికి ఆ పార్టీకి ఆయన చెడ్డవాడు అయిపోయాడు..ఆయన కొడుకూ చెడ్డవాడయిపోయాడు. ఆయన కొడుకు అయినందుకు నన్ను జైలుకి కూడా పంపింది,” అని అన్నారు.
“కనుక కేవలం వైకాపాకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తెలంగాణాలో ప్రతీ ఇంటికీ ఏదో ఒక మేలు చేసారు. ప్రతీ పేదవాడిని ఆదుకొన్నారు. మళ్ళీ అటువంటి స్వర్ణయుగం తెచ్చుకోవాలంటే వైకాపాకే ఓటు వేసి గెలిపించాలి,” అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.