ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన ఆయన తిరుపతిలో పర్యటించాలనుకున్నారు. ఓ రోజు మొత్తం తిరుపతి లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన మళ్లీ క్యాన్సిల్ చేసుకున్నారు. నెల్లూరు, తిరుపతిల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లుగా ఆయన లేఖ కూడా విడుదల చేశారు. అంటే ప్రజల కోసమే జగన్ తిరుపతి పర్యటన వాయిదావేసుకున్నారన్నమాట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత ఆయన బయటకు వస్తున్నారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది.
అయితే సీఎం చెప్పినట్లుగా కరోనానే కారణమా అంటే… వైసీపీ నేతల ప్రచారాలను .. మరి అదేంటి అనిచూపిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. తిరుపతిలో ప్రతి నియోజకవర్గంలోనూ .. బాధ్యులైన మంత్రులు.. ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు. గ్రామాల వారీగా బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. ఆ మాటకొస్తే ఒక్క వైసీపీ మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతలు తిరుపతిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు కూడా పెట్టుకోకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ సీఎం జగన్ తన పార్టీ వారికి ఎలాంటి సందేశాలు ఇవ్వకుండానే.. తాను కరోనా కారణంగానే ప్రచారాన్ని విరమించుకుంటున్నానని ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి మొదట ప్రచారానికి వస్తారని ప్రకటించినప్పుడు… ఇతర పార్టీల నేతలు… పరిస్థితి బాగో లేదు కాబట్టే…ప్రచారానికి వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు.. ఆగిపోయారు కాబట్టి.. ఆశలు వదిలేసుకున్నారు కాబట్టే.. అని ప్రచారం చేస్తారేమో చూడాలి. జగన్ తిరుపతికి వెళ్లకపోవడం వల్ల తిరుమల టూర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. పదిహేనో తేదీన ఆయన తిరుమలలో పర్యటించి కొత్తగా నిర్మించిన బూందీపోటును ప్రారంభించాల్సి ఉంది. కానీ అది కూడా వాయిదా పడినట్లయింది.