వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందా ? ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రచార సభల్లో అదే చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందని తాను రాగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై పెడతానని అంటున్నారు. నిజానికి ఆ వ్యవస్థకు లాస్ట్ వర్కింగ్ డే మే 31. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. మామూలుగా అయితే కోడ్ రాక ముందే ఈ వ్యవస్థ కొనసాగింపునకు ఉత్తర్వులు ఇచ్చేవారు. జగన్ కు ఆ ఉద్దేశం లేదు.అందుకే ఇవ్వలేదు. ఇప్పుడు ముందే ఆ వ్యవస్థ రద్దయిందని చెబుతున్నారు.
వాలంటీర్లకు ప్రధానంగా ఉండే విధి ఒక్కటే పించన్లు పంచడం. మూడు వేలు పించన్ ఇవ్వడానికి ఐదు వేల జీతం అనే సెటైర్లు ఇందుకే వినిపిస్తాయి. మిగదంతా వారు చేసేది వైసీపీ పని. ఆ ప ని చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. అంటే వాలంటీర్లకు పనేమీ లేదు. ఇక ఇచ్చే ఆ ఐదు వేల జీతం కూడా ఎందుకు దండగ అనుకున్నారేమో కానీ .. వ్యవస్థను రద్దు చేసేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఫిర్యాదుతో ఈసీ రద్దు చేసిందనేది జగన్ ఆరోపణ. రద్దు అనే మాట ఇప్పటి వరకూ వినిపించలేదు. ఒక్క జగన్ నోటనే వస్తోంది. అంటే.. ఇక్కడే అతి పెద్ద కుట్ర జరుగుతోందని అర్థం అవుతోంది.
వాలంటీర్లు నీతి, నిజాయితీగా ఉంటే కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అసలు కొనసాగించడానికి అవకాశం లేకుండా వ్యవస్థనే ముందుగా రద్దు చేసేసే కుట్ర అమలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసి ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి… ప్రైవేటు సంస్థలకు పంపడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారి అవసరం తీరిపోయాక.,. పక్కన పడేసారు. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు తొలి సంతకం సంగతేమో కానీ… అసలు జగన్ చేసిన మోసం మాత్రం కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది.