జగన్ కేసులు ఎందుకు ఆలస్యమవుతున్నాయన్నదానిపై ఈడీ, సీబీఐ తమ అఫిడవిట్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. వీటిని పరిశీలించిన తర్వాత తగు ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరి పదో తేదీకి వాయిదా వేసింది. గతంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం జగన్ సహా ఇతర నిందితులు అంతా ఉద్దేశపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు క్వాష్ పిటిషన్లు, ఇతర పిటిషన్లు దాఖలు చేయడంతో ఆలస్యమవుతున్నాయి. అంటే నిందితులు ఉద్దేశపూర్వకంగా న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారని అనుకోవచ్చు.
ఈడీ కేసుల విచారణ కూడా హైకోర్టు ఆదేశాల కారణంగానే ఆగిపోయింది. సీబీఐ కేసులు.. ఈడీకేసులు వేర్వేరు అయినప్పటికీ హైకోర్టు సీబీఐకేసుల్లో విచారణ పూర్తయినతర్వాతనే ఈడీ కేసుల్లో విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ హైకోర్టు ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రఘురామ రాజు వేసిన పిటిషన్ తో సుప్రీంకోర్టులో అసలు కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంత కాలం ఆలస్యం కావడం న్యాయవ్యవస్థకూ ఇబ్బందికరమే కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఏర్పడింది.
మరోవైపు స్తబ్దతో ఏర్పడిన వివేకా హత్యకేసులోనూ సంచలన పరిణామాలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే జరగనున్నాయి. సీబీఐ అధికారిపై పెట్టిన తప్పుడు కేసులో విచారణ జరుగుతోంది. సీబీఐ విచారణ కొనసాగింపు, నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లు అన్నీ వచ్చే ఏడాది విచారణలోకి రానున్నాయి.