ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క సామాజికవర్గమే కనిపిస్తోంది. ప్రతీ విషయాన్ని ఆయన సామాజికవర్గంతోనే ముడి పెట్టుకుంటున్నారు. ఆ ఒక్క సామాజికవర్గం అంటూ.. పదే పదే కలవరిస్తున్నారు. ఈ విషయం అసెంబ్లీ వేదికగా మరోసారి బయట పడింది. ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో.. ఆయన … కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసి.. ఇంగ్లిష్ మీడియంను.. తీసుకురావాలన్న నిర్ణయాన్ని మీడియా సంస్థలు వ్యతిరేకించాయని.. ప్రత్యేక కథనాలు రాశాయని… కథనాల ప్రింట్లు తీసుకొచ్చి మరీ.. జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు.
తెలుగు మీడియం రద్దు విషయంలో ఆ కథనాలన్నింటినీ ఓ సామాజికవర్గం దాడిగా చెప్పుకోవచ్చని జగన్ నిర్మోహమాటంగా ప్రకటించారు.
ఇంగ్లిష్ మీడియం అనగానే ఓ సామాజికవర్గం దాడి మొదలు పెట్టిందని విమర్శించారు. తన విమర్శల్లో మరోసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును ప్రస్తావించారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం ను ఎవరూ వ్యతిరేకించలేదు. తెలుగు మీడియం రద్దును మాత్రమే అందరూ ప్రశ్నించారు.
కానీ జగన్మోహన్ రెడ్డి తన మానాన తాను రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భాషకు కూడా… సామాజికవర్గం అంట గట్టేశారు. తెలుగు భాష కోసం.. ఒక్క సామాజికవర్గమే తాపత్రయ పడుతోందన్నట్లుగా మాట్లాడారు. ఎన్నికల ముందు నుంచీ.. ఓ సామాజికవర్గం.. ఓ సామాజికవర్గం అంటూ… రెచ్చగొట్టే రాజకీయాలు చేసిన జగన్… ఇప్పుడు.. తన నిర్ణయాలపై వచ్చే వ్యతిరేకతను కూడా ఆ సామాజికవర్గానికే అంట గడుతున్నారు.