ఆంధ్రా రాజకీయాల్లోకి వస్తామని కేసీఆర్ ప్రకటించాక… అది వైకాపాకి మద్దతుగానే అనే ఒక అప్రకటిత అభిప్రాయం ప్రజల్లో దాదాపుగా ఏర్పడుతోంది. ఇది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు! అందుకే, ఈ విషయంలో ముందుగా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు జగన్. పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… తెరాస విషయంలో మారిన టీడీపీ వైఖరి అనే అంశాన్ని పెద్దదిగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెరాసతో కలిసిమెలిసి ఉందామనుకుంటే ప్రధాని మోడీ అడ్డుపడ్డారని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారంటూ గుర్తుచేశారు. హరికృష్ణ మరణానంతరం కూడా ఆ పార్టీతో పొత్తు కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ తో చంద్రబాబు నాయుడు మంతనాలు జరిపారనీ, అదే విషయాన్ని కేటీఆర్ చాలాసార్లు చెప్పారంటూ కూడా ప్రస్థావించారు. ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లోకి వస్తామని తెరాస ప్రకటించేసరికి… ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న పార్టీ తెరాస అంటూ చంద్రబాబు వైఖరి మార్చేశారంటూ వ్యాఖ్యానించారు.
ఇక్కడ చాలా కన్వీనియంట్ గా తెరాసతో టీడీపీ వ్యవహరించిన వైఖరిని మార్చి చెప్పేస్తున్నారు జగన్. తెరాసతో దోస్తీ కోసం చంద్రబాబు ప్రయత్నించిన మాట వాస్తవమే. కానీ, ఆ సందర్భమేంటీ… జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కోవాలంటే… బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటి మీదికి రావాల్సి ఉందన్నది చంద్రబాబు ఆలోచన. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తున్న క్రమంలో, విభజన హామీలను రెండు తెలుగు రాష్ట్రాలకూ సక్రమంగా అమలు చేయని మోడీ వైఖరికి వ్యతిరేకంగా జరిగిన ప్రయత్నం అది. ఆ క్రమంలో తెరాసతో దోస్తీకి ప్రయత్నించారు.అయితే, సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ కి అనుకూలంగా మోడీ వ్యవహరించడం గమనించాం. కేసీఆర్ తో పోల్చుతూ చంద్రబాబుపై మోడీ విమర్శలు చేశారు. అదే సమయంలోనే ఏపీ ప్రత్యేక హోదాపై కూడా తెరాస వ్యాఖ్యానించింది. ఏపీకి హోదా ఇస్తే… అదే స్థాయి ప్రయోజనాలు తమకూ కావాలనే వాదన వినిపించింది. దీంతో, తెరాసతో టీడీపీకి దోస్తీ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు… తెలంగాణలో టీడీపీతో పోరాటమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చేసింది. అంటే, టీడీపీతో వైరం అక్కడ కేసీఆర్ కు అవసరమైన అంశం కాబట్టి… ఆ పార్టీని దూరం పెట్టాల్సిన అవసరం తెరాసకీ ఏర్పడింది.
అయితే, ఈ ఇదంతా వదిలేసి… తెరాస విషయంలో చంద్రబాబు వైఖరి మార్చేశారు అనే పాయింట్ ని మాత్రమే జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. భాజపా వ్యతిరేకంగా కూటమి కట్టే క్రమంలో తెరాస మద్దతు చంద్రబాబు కోరిన అంశాన్ని చెప్పడం లేదు. ఆ తరువాత, టీడీపీకి వ్యతిరేకంగానే తెరాస అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసిందని చెప్పడం లేదు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు ఊసరవెల్లి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వైఖరి జగన్ ఎందుకు ఎత్తుకున్నారంటే… కేవలం ముందుజాగ్రత్త చర్య మాత్రమే! ఆ పార్టీ మద్దతు వైకాపాకే ఉంటుందని ప్రజల్లో బలంగా ఓ అభిప్రాయం ఏర్పడిపోతే… అది తమకి ఇబ్బంది అవుతుందేమో అనేదే ఈ వ్యాఖ్యల వెనక జగన్ కి ఉన్న బెదురుగా కనిపిస్తోంది. జగన్ ప్రసంగం మొత్తంలో… తమకు తెరాస మద్దతు ఇచ్చినా తాము తీసుకునే ప్రయత్నం చెయ్యం అని కరాఖండీగా తెగేసి చెప్పడం లేదు.