ఒక అభ్యర్థిని ప్రకటిస్తారు. ఆయన నాకు వద్దంటారు. దీంతో మళ్లీ అభ్యర్థిని ప్రకటిస్తారు. ఆయన సరే అన్నా పని చేయరు. దీంతో మరో అభ్యర్థిని ప్రకటిస్తారు. .. ఈ సైకిల్ ఇలా కొనసాగుతూ వస్తోంది. వైసీపీ అభ్యర్థుల జాబితాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ జాబితా విడుదల చేస్తారు.. ఆ జాబితాకు సవరణగా మరో జాబితా విడుదల చేస్తారు. దీంతో అసలు జాబితాలే పెద్ద ఫార్సుగా మారిపోయాయి. తాజాగా ఎనిమిదో జాబితాను చూస్తే.. వైసీపీ అధినాయకత్వం ఎంత దీన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుంటూరు ఎంపీగా క్రికెటర్ అంబటి రాయుడు పేరు ప్రచారం చేశారు.. తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణకు చాన్సిచ్చారు. చివరికి ఉమ్మారెడ్డి అల్లుడు , పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య పేరును ఖరారు చేశారు. కానీ ఆయన కూడా నిలబడతారన్న గ్యారంటీ లేదు. ఇక ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామితో ఓ రకంగా బంతాట ఆడుకున్నారు. మొదట ఎంపీ సీటు అన్నారు.. తర్వాత మళ్లీ ఆయనకే సీటు అన్నారు… ఇప్పుడు ఆయన కుమార్తె పేరును ఖరారు చేశారు. ఇక కందుకూరుతో మరో పెద్ద కథ. పెద్దగా కారణం లేకుండానే సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఇంచార్జ్ గా నియమించారు. వారు అంతకు వారం ముందే పార్టీలో చేరారు. తీరా అభ్యర్థిత్వం ఇచ్చాక వారు నియోజకవర్గానికి వెళ్లడం మానేశారు. సిద్ధం సభలో కార్యకర్తలు ప్రదర్శించేందుకు అవసరమైన జెండాలు.. పోస్టర్లు… సిద్ధం అనే కటౌట్లను లారీల్లో కందుకూరుకు పంపితే… ఒక్కరంటే ఒక్క నేత కూడా దింపుకోవడానికి సిద్ధపడలేదు. దాంతో వెనక్కి పంపేశారు.
చివరికి కనిగిరిలో టిక్కెట్ నిరాకరించిన బుర్రా మధుసూదన్ ను కందుకూరులో టిక్కెట్ ఇచ్చారు.
ఇంకేం మార్పులు ఉండవనడానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు జాబితాలతో బంతా ఆడుతున్నారు సీఎం జగన్. తాజాగా ఆయన టీడీపీ, జనసేనల్లో అసంతృప్తిలో ఉన్న వారికి టిక్కెట్లు ఆఫర్ చేస్తున్నారు. గొల్లపల్లి సూర్యారావుతో పాటు మండలి బుద్దప్రసాద్, వంగవీటి రాధా, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇలా… ఎవరైనా వస్తే టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఈ ఆకర్ష్ ప్రయోగించి… చాలా మందికి టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో వైసీపీ జాబితాలపై.. వైసీపీలో టిక్కెట్ల కసరత్తుపై అందరూ నమ్మకం కోల్పోతున్నారు.